Yadadri Name Change : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి యాదాద్రి(Yadadri). గతంలో దీన్ని అంతా యాదగిరి గుట్టగానే పిలిచేవారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేరును యాదాద్రిగా మార్చింది. అయితే ఇప్పుడు ఆ పేరును తిరిగి యాదగిరి గుట్ట (yadagirigutta)గా మార్చనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్య బీర్ల అయిలయ్య ప్రకటించారు.
యాదాద్రి ఆలయంలో కొబ్బరి కాయలు కొట్టే స్థలాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రి(Yadadri) పేరును తిరిగి యాదగిరి గుట్టగా(yadagirigutta) మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. యాదాద్రి కొండపౌ డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం తొందరలో కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పుణ్య క్షేత్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని అన్నారు. త్వరలోనే ఆయన క్షేత్ర సందర్శనకు రానున్నారని తెలియజేశారు. అనాదిగా పూర్వ కాలం నుంచి ఈ క్షేత్రానికి ఉన్న పేరును మార్చడం సరికాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.