పెళ్లిళ్లలో… వధూ, వరుల కుటుంబాల మధ్య మాట పట్టింపులు రావడం…. ముఖ్యంగా భోజనాల దగ్గర గొడవలు జరగడం లాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి. వరుడి తరపు వారికి సరిగా భోజనం వడ్డించకపోతే ఆగిపోయిన పెళ్లిళ్లు చాలానా ఉన్నాయి. తాజాగా…. వరుడి స్నేహితులకు చికెన్ వడ్డించలేదని గొడవ పడి… ఏకంగా పెళ్లి ఆపేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది.షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం కావడంతో విందులో అన్నీ శాకాహార వంటలే చేశారు. విందు ఇక ముగుస్తుందన్న సమయంలో వరుడి తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు.
అక్కడున్న శాకాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి గొడవపడి తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది వధూవరుల కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. చివరికి నిన్న జరగాల్సిన వివాహం ఆగిపోయింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రేపు వివాహం జరిపించాలని నిర్ణయించారు.