అక్టోబర్ నెలలో బతుకమ్మ (Batukamma), దసరా (Dasara) పండగలు రానున్న నేపథ్యంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్న్యూస్ చెప్పింది. పట్టణాలు, నగరాల్లో ఉండేవారు తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఏకంగా 5,265 ప్రత్యేక బస్సులను (Special Busses) ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 13వ తేది నుంచి 25వ తేది వరకూ ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ప్రత్యేక బస్సుల్లో(Special Busses) 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని టీఎస్ఆర్టీసీ (TSRTC) ఇచ్చింది. అక్టోబర్ 22వ తేదిన సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24న దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టీ మరికొన్ని ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం ప్రత్యేక బస్సులు నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సన్నద్దమైంది. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.