»Tpcc Chief Revanth Reddy Has Written To The Dgp To Provide 66 Security
Revanth Reddy : 6 ప్లస్ 6 భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ రాసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తన భద్రత విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా.. సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు 6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) డీజీపీకి లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పి కూడా ఆ మేరకు భద్రత ఇవ్వడం లేదని ఆ లేఖలో ఆరోపించారు. అదనపు సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీసులు హైకోర్టు(High Court)లో తప్పుడు వాదనలు చేశారన్నారు. పైగా గత జులైలో తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారన్నారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6 ప్లస్ 6 భద్రత కల్పించాలని, లేదంటే కోర్టుకు వెళతానని డీజీపీ (DGP)కి రాసిన లేఖలో పేర్కొన్నారు. భూపాలపల్లి(Bhupalpalli)లో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్ కట్టకుండా అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్(Congress)కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో తనకు సెక్యూరీటి పెంచాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది (Advocate) కోర్టుకు తెలిపింది. పాదయాత్ర సందర్భంగా భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించినట్టు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) తెలిపారు. భద్రత కల్పించాలని ఆదేశించిన ఫ్యాక్స్ కాపీని కోర్టుకు సమర్పించారు. డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.