Telangana: శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ.. బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. తర్వాత మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు, మార్షల్స్ వాళ్లని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసి వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా.. ఉత్తర్వులు చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించారు.
బారికేడ్లు అడ్డుగా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో, ఇక్కడా గొంతు నొక్కడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నాలుగు వేల మంది పోలీసులను మోహరించారని ఆరోపించారు. ఇనుప కంచెలు తీసివేశామన్నారని, మళ్లీ ఇక్కడ ఆంక్షలెందుకని కడియం ప్రశ్నించారు.