»Telangana Panchayat Raj Department Plans To Steel Bank In Every Village
Steel Bank పల్లెపల్లెనా స్టీల్ బ్యాంక్.. ఇక మన ఊరు పరిశుభ్రం
ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వినియోగంతో డబ్బు ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.
ప్రతి వస్తువు ప్లాస్టిక్ (Plastic)తో ముడిపడినదే. ఆ పదార్థం లేని వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా మన జీవితంలో (Life) ఇమిడిపోయిన ఆ ప్లాస్టిక్ భూమిలోకి ఇంకిపోని పరిస్థితి. అందుకే ప్లాస్టిక్ వ్యర్థాలు (Wastage) ఎక్కడ చూసినా కుప్పల్లా పేరుకుపోతున్నాయి. ఈ భూతాన్ని తొలగించేందుకు ఒక గ్రామం తీసుకున్న ఆదర్శ నిర్ణయం.. అన్ని గ్రామాల్లో అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో (Telangana) పల్లెపల్లెనా ఆ కార్యక్రమం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్ధిపేట జిల్లాలో (Siddipet District) పంచాయతీల్లో స్టీల్ బ్యాంక్ (Steel Bank)ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వినియోగంతో డబ్బు ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department) నిర్ణయం తీసుకుంది.
స్టీల్ బ్యాంక్ అంటే..
గ్రామంలో జరిగే శుభకార్యం, వేడుకలు, సమావేశాలు ఏది నిర్వహించినా ఆ సమావేశాల్లో ప్లాస్టిక్ వినియోగం నిషేధం (Ban). పంచాయతీలోనే స్టీల్ గ్లాసులు, మగ్గులు, ప్లేట్లు, గిన్నెలు, స్టీల్ బాటిళ్లు, పెద్ద పెద్ద పాత్రలు అన్ని ఉంటాయి. అవసరమైన వారు నిర్ణీత రుసుము (Fee) చెల్లించి ఆ స్టీల్ సామాన్లు వినియోగించుకోవచ్చు. మళ్లీ పంచాయతీకి అప్పగించాలి. దీని ద్వారా టెంట్ హౌస్ (Tent House) కంటే అతి తక్కువ ఖర్చుతో సామగ్రి వినియోగించవచ్చు.
ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో సంపూర్ణంగా, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఈ స్టీల్ బ్యాంక్ లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 170 మండలాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఈ స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. క్రమంగా వీటి సంఖ్య పెంచాలని పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టీల్ బ్యాంకులు త్వరలో ఏర్పాటు కానున్నాయి.