»Telangana Minister Malla Reddy Fire On Mps Revanth Reddy Dharmapuri Arvind
BRS Party కాంగ్రెస్, బీజేపీ నాయకులను చీపుర్లతో కొట్టండి: మంత్రి మల్లారెడ్డి పిలుపు
ఆరు నెలల్లో తాము వస్తామని చెబుతున్నారు. ఎట్ల వస్తారు? ప్రజలకు ఏం చేశారని ఓట్లడుగుతారు? ఏం ముఖం పెట్టుకుని అడుగతారు? వారికి ఓట్లు అడిగే హక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉంది
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు (Votes) అడగడానికి వచ్చే ఆయా పార్టీ నాయకులను చీపురుతో తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, అరవింద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఎంపీలుగా గెలిచి మల్కాజిగిరి, నిజామాబాద్ (Nizamabad) కు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armoor) నియోజకవర్గంలోని మాక్లూర్ (Makloor)లో మంగళవారం బీఆర్ఎస్ (BRS Party) ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntal Kavitha), ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో (Jeevan Reddy) కలిసి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆరు నెలల్లో తాము వస్తామని చెబుతున్నారు. ఎట్ల వస్తారు? ప్రజలకు ఏం చేశారని ఓట్లడుగుతారు? ఏం ముఖం పెట్టుకుని అడుగతారు? వారికి ఓట్లు అడిగే హక్కు లేదు. బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉంది’ అని స్పష్టం చేశారు.
‘గత ఎన్నికల్లో చిన్న తప్పిదం జరిగింది. కవితను కాకుండా అరవింద్ (Arvind)ను ఎంపీగా గెలిపించారు. అతడిని గెలిపిస్తే పసుపు బోర్డు రాలేదు. వాళ్లు ఉంటే ఏదీ రాదు. కర్ణాటక (Karnataka) ఎన్నికలతో బీజేపీ పనైపోయింది. దేశంలోని ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) అందిస్తున్న పథకాలు ఒక్కటీ లేవు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కవితను మరోసారి నిజామాబాద్ ఎంపీగా గెలిపించాలి.’ అని మల్లారెడ్డి కోరారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు ఉన్న సీట్లు గెలుచుకోవడమే కష్టమని పేర్కొన్నారు.