»Telangana Dao Candidate Chewed And Swalloed Omr Sheet In Nizamabad
Swallowed OMR తప్పు చేసి తప్పించుకోలేక OMR Sheet మింగేసిన అభ్యర్థి
సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో తోచక పక్కన కనిపించిన ఓఎమ్ఆర్ షీట్ తీసుకున్నట్లు చెప్పాడు. తాను తప్పు రాసిన షీట్ ను చించివేసి వాటిని మింగేసినట్లు ముఖీద్ వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడి నోటి నుంచి కొన్ని ఓఎంఆర్ షీట్ ముక్కలను అధికారులు సేకరించారు.
తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తోంది. పోరాడి సాధించుకున్న విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ యువత ప్రస్తుతం పుస్తకాలతో కుస్తీ పడుతోంది. పోలీస్, గ్రూప్స్, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రకటనలు విడుదలై ప్రస్తుతం పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (Divisional Accounts Officer-DAO) పరీక్షలు ఫిబ్రవరి 26న జరిగాయి. టీఎస్ పీఎస్సీ (TSPSC) ఈ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. అయితే ఓ అభ్యర్థి మాత్రం ఓఎమ్ఆర్ షీట్ (Optical mark recognition- OMR Sheet) మింగేయడం కలకలం రేపింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా (Nirmal District)కు చెందిన అబ్దుల్ ముఖీద్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission–TSPSC) డీఏఓ పరీక్షకు హాజరయ్యాడు. అతడికి నిజామాబాద్ మండలం బోర్గాం (పీ) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంగా పడింది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన ముఖీద్ ఓఎంఆర్ షీట్ తీసుకున్నాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికి ముఖీద్ పక్కన రావాల్సిన ఓ అభ్యర్థి గైర్హాజరయ్యాడు. అయితే అతడి స్థానంలో ఉంచిన ఓఎమ్ఆర్ షీట్ కనిపించలేదు. షీట్ ఎక్కడ అని ఇన్విజిలేటర్ అధికారి అడగ్గా తనకు తెలియదని బుకాయించాడు. ఓఎమ్ఆర్ షీట్ కనిపించకపోవడంతో అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ దృశ్యాల్లో ముఖీద్ ఓఎమ్ఆర్ తీసుకుంటున్నది కనిపించింది. దీంతోపాటు అతడు షీట్ ను చించివేసి మింగడం కనిపించింది. ఎందుకు ఇలా చేశావని అధికారులు నిలదీయగా జరిగిన వాస్తవం తెలిపాడు.
ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ (Hall Ticket Number) నంబర్ తప్పుగా రాసినట్లు ముఖీద్ తెలిపాడు. సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలో తోచక పక్కన కనిపించిన ఓఎమ్ఆర్ షీట్ తీసుకున్నట్లు చెప్పాడు. తాను తప్పు రాసిన షీట్ ను చించివేసి వాటిని మింగేసినట్లు ముఖీద్ వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడి నోటి నుంచి కొన్ని ఓఎంఆర్ షీట్ ముక్కలను అధికారులు సేకరించారు. ఈ ఘటనపై పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు అతడిపై చీటింగ్, మాల్ ప్రాక్టీస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ముఖీద్ నిజామాబాద్ కో ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ గా పని చేస్తుండడం విశేషం. అతడి తండ్రి మరణించడంతో ఆ ఉద్యోగం ముఖీద్ కు వచ్చింది.
కాగా ఈ పరీక్షకు 1,06,253 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1 పరీక్షకు 67,830 మంది రాయగా.. మధ్యాహ్నం పేపర్-2 66,903 మంది పరీక్షలు రాశారు. మొత్తం 241 కేంద్రాల్లో 63 శాతం మంది పరీక్షలు రాసినట్లు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ (Anitha Ramachandran) తెలిపారు. రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీటి మినహా రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా సాగింది. త్వరలోనే ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు.