Yadadri Brahmotsavams యాదాద్రికి నిజాం రాణి బంగారు కానుక
ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు ఆలయ పాలక మండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ ఉత్సవాల సందర్భంగా భారీ భక్తులు వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణ ఆలయ నగరి యాదాద్రి బ్రహ్మోత్సవాల (Yadadri Brahmotsavams)లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో రూపంలో స్వామి అమ్మవార్లు దర్శనమిస్తున్నారు. ఆలయ పున:నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy) ఆలయ వార్షికోత్సవాలు జరుగుతున్న ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనారసింహుడికి భక్తులు భారీ ఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు. ఇటీవల ఓ కుటుంబం దాదాపు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించాడు. తాజాగా నిజాం రాణి యాదాద్రివాసుడికి బంగారు హారం కానుకగా ఇచ్చింది.
హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజులు (Nizam Rulers) దాదాపు 400 సంవత్సరాలు పరిపాలించారు. ఆ సమయంలో కూడా యాదాద్రి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రంగా వెలుగొందింది. గతంలో యాదాద్రి ఆలయానికి నిజాం రాజులు కానుకలు ఇచ్చారు. వారు ముస్లింలైనా ఆలయంలో పూజాది కార్యక్రమాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుని మత సామరస్యాన్ని చాటారు. తాజాగా వారి వారసత్వాన్ని నిజాం వారసురాలు కొనసాగించింది. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి నిజాం రాణి బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ (Begum Sahiba Esra Birgen) బంగారు హారాన్ని అందించింది. తనకు అందిన హారాన్ని వైటీడీఏ (YTDA) చైర్మన్ కిషన్ రావు (Kishan Rao) ఆదివారం ఆలయంలో ఈవో గీతారెడ్డికి అందజేశారు. రాణి అందించినది 67 గ్రాముల బంగారు హారం. దాని విలువ దాదాపు రూ.4 లక్షలకు పైన ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా హారానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి అలంకరించారు. కాగా అలనాటి సంప్రదాయాన్ని ఇంకా నిజాం రాజులు కొనసాగించడం అందరిలో ఆసక్తి రేపింది. మతాలకతీతంగా యాదాద్రి ఆలయానికి కానుక అందించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈనెల 22వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరుగనున్నాయి. ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు ఆలయ పాలక మండలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా వారాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ ఉత్సవాల సందర్భంగా భారీ భక్తులు వస్తుండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డూ ప్రసాదాలు కొరత ఏర్పడకుండా.. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరు కానున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం. ఈనెల 28వ తేదీన జరుగనున్న కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. హెలికాప్టర్ లో వచ్చే అవకాశం ఉండడంతో హెలిప్యాడ్ సిద్ధం చేయనున్నారు.
ఉత్సవాల షెడ్యూల్
28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార హనుమంత వాహన సేవ
సాయంత్రం 8 గంటలకు గజవాహన సేవ, తిరు కల్యాణోత్సవం
– మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ
సాయంత్రం 7 గంటలకు దివ్య విమాన రథోత్సవం
– 2న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం
సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, దేవతోద్వాసన
– 3న ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘాటాభిషేకం
రాత్రి 9 గంటలకు డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి