ఎవరూ ఔనన్నా కాదన్నా తెలంగాణ (Telangana) అంటే కేసీఆర్ (Kalvakuntla Chandrasekhar Rao).. కేసీఆర్ అంటేనే తెలంగాణ. తెలంగాణ తెచ్చింది.. ఇప్పుడు పాలిస్తున్నది కేసీఆర్. ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన కారణజన్ముడుగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను భావిస్తున్నారు. అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ (Delhi) ప్రభుత్వాన్ని గజగజ వణికించి తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) తీసుకొచ్చిన ఘనుడు కేసీఆర్. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా తానే తెలంగాణ రక్షకుడిని అని ప్రకటించుకుని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి నిర్వీరామంగా తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ శుక్రవారం 69వ జన్మదినం (BirthDay) జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు HitTv జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.
పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
జన్మదినం: 17 ఫిబ్రవరి 1954
స్వగ్రామం: చింతమడక, సిద్దిపేట జిల్లా
తల్లిదండ్రులు: వెంకటమ్మ, రాఘవరావు
కుటుంబం: సతీమణి శోభ, పిల్లలు కల్వకుంట్ల తారక రామారావు (KTR) (తెలంగాణ మంత్రి), కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) (తెలంగాణ ఎమ్మెల్సీ)
బాల్యం: కల్వకుంట్ల కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోవడంతో చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల కేసీఆర్ చిన్నతనంలో సాధారణ జీవితం అనుభవించాడు.
విద్యాభ్యాసం: సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (MA) (తెలుగు సాహిత్యం) చదివాడు.
తెలుగు సాహిత్యంలో పట్టు. రచనలు కూడా చేస్తారు.
రాజకీయ గురువు: అనంతుల మదన్ మోహన్ (Madan Mohan)
రాజకీయ ప్రస్థానం:
కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి రాజకీయ జీవితం మొదలు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. అప్పటి కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ పిలుపుతో కాంగ్రెస్ లో చేరిక. యువజన కాంగ్రెస్ నాయకుడిగా కేసీఆర్ ఉద్యమాలు నడిపించాడు. అనంతరం 1982లో తన అభిమాన నటుడు నందమూరి తారక రామారావు (NT RamaRao) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) స్థాపించడంతో పసుపు కండువా వేసుకున్నాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
– 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసి టీఆర్ఎస్ 5 ఎంపీ స్థానాలు సొంతం చేసుకుంది.
– 14వ లోక్సభలో ఉమ్మడి ఏపీలోని కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం.
– 2004 నుండి 2006 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశాడు.
– 15వ లోక్సభలో మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించాడు.
– 2018 డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం.
తెలంగాణ ఉద్యమం
ఎన్టీఆర్ మరణం తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కావాలనే ఆకాంక్ష బలంగా మొదలైంది. అప్పటి సీఎం చంద్రబాబు తెలంగాణపై వివక్ష కొనసాగించడంతో డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేశాడు. 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించాడు.
– 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని స్థాపించాడు. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు కూడా సాధ్యమనే అభిప్రాయం ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.
– టీఆర్ఎస్ ను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట కరీంనగర్ భారీ బహిరంగ సభ ఏర్పరిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమిస్తానని కేసీఆర్ ప్రకటించాడు.
– 2004 ఎన్నికలలో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఐదుగురు ఎంపీలు సాధించడంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేపథ్యంలోని యూపీఏ కూటమిలో భాగమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ చేరింది. నాడు కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. 2004 నుండి 2006 వరకు కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంపై స్పష్టత ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి కేసీఆర్ బయటకు వచ్చాడు. మంత్రి పదవులకు రాజీనామా చేశాడు.
– అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో కేసీఆర్ విజయం.
– 2008లో మళ్లీ ఉప ఎన్నికలు అదే కరీంనగర్ నుంచి పోటీచేసి విజయం.
– 2009 ఎన్నికలలో మహబూబ్ నగర్ ఎంపీగా విజయం.
నిరాహార దీక్ష
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు చేపట్టాడు. 12 రోజులు అలుపెరగకుండా దీక్ష సాగించడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. తెలంగాణ ఏర్పాటుపై డిసెంబర్ 9న ప్రకటన విడుదల చేసింది.
– అనంతరం మళ్లీ తెలంగాణ ఉద్యమం కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం నడిపించాడు. జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంతో కేసీఆర్ కీలక పాత్ర పోషించాడు.
తెలంగాణ తొలి సీఎం
– పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 2 జూన్ 2014న కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశాడు.
– సెప్టెంబర్ 2018లో అసెంబ్లీని రద్దు చేసి సంచలనం రేపాడు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి 119 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేయగా 88 స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని రికార్డు నెలకొల్పాడు.
– 13 డిసెంబర్ 2018న రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
బీఆర్ఎస్ స్థాపన
తెలంగాణ మోడల్ దేశంలో అమలు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మార్చారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలను మొదలుపెట్టాడు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నాడు.