Telangana : స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ హవా కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ అర్బన్ విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి 4 అవార్డులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకోగా, దక్షిణ భారత విభాగంలో సిద్దిపేట, గుండ్లపోచంపల్లి, నిజాంపేట్ పట్టణాలు అవార్డులు పొందాయి. ఈ నెల 11న ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కేంద్రం ఈ అవార్డులను అందజేయనుంది. స్వచ్ఛ అవార్డులపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు.
జాతీయ స్థాయిలో మరోసారి మన సిద్దిపేట సత్తా చాటిందని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణలో సిద్దిపేట వినూత్న విధానాలు దేశానికే ఆదర్శమన్నారు. సిద్దిపేటకు జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ దిశగా కృషి చేసిన పట్టణ ప్రజలకు, కృషి చేసిన కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.. అంటూ హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.