Sudheer Reddy: పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడ్డా అనే డైలాగ్ వినగానే గుర్తొచ్చే వ్యక్తి మంత్రి మల్లారెడ్డి. ఆ ఒక్క డైలాగ్‌తో ఆయన ఎంతో ఫేమస్ అయ్యారో తెలుసు. మల్లారెడ్డి పాలమ్మి, పూలమ్మి, కష్టపడి ధనవంతుడు కాలేదని, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత డబ్బులు దొంగలించి, కొంతమంది ఆస్తులు కాజేసి పైకొచ్చాడని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆయనపై ఆరోపణలు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సుదీర్‌రెడ్డి మల్లారెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం జయలలితకు నగర శివార్లలోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని, అందులో డైయిరీ ఫాం ఏర్పాటు చేశారని, మల్లారెడ్డి పాలవ్యాపారం చేసేందుకు అక్కడికి వెళ్లేవారని ఆయన తెలిపారు.
ఐటీ దాడులు జరుగుతాయని జయలలితకు ముందే సమాచారం రావడంతో తన దగ్గర ఉన్న డబ్బు, నగలను ఓ చోట దాచిపెట్టిందని, వాటిని మల్లారెడ్డి దొంగతనం చేసినట్లుగా సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఇంటి పక్కన ఉండే క్రిస్టియన్ విద్యాసంస్థల యజమానురాలిని మోసం చేసి, వాళ్ల కుటుంబాలకు తెలియకుండా సంతకాలు పెట్టించుకున్నాడని అన్నారు. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఆస్తి కాజేశాడని చెప్పుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. మైసమ్మగూడలో చెరువు దగ్గర స్థలాలను కబ్జా చేసి అక్రమంగా కాలేజీలు కట్టారని, మొన్న వచ్చిన భారీ వర్షాలకు చాలామంది విద్యార్థులు ఆ వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. కానీ తమ మేనిఫెస్టోను బీఆర్ఎస్ నాయకులు కాపీ కొట్టారని విమర్శించారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు.