కొద్ది నెలలుగా జీతాలు లేక తెలంగాణలోని వీఆర్ఏలు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తమకు ఇప్పటికే రెండు, మూడు నెలల నుంచి జీతం రావడం లేదని..ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలోని వీఆర్ఏలకు మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏ(VRA)లను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 16,583 మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. సర్దుబాటు ప్రక్రియలో ఇబ్బందులు, వేతనాలు (Wages) రాకపోవడం వంటి వాటితో ఈ ఎన్నికల్లో అధికార పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలుపుకుంటే వీరి ఓట్లు 80 వేల వరకు ఉంటాయి. బంధు మిత్రులు, ఇతరులను కలుపుకుంటే ఐదు లక్షల ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా పడే అవకాశముందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, రెవెన్యూ, విద్యాశాఖ, మిషన్ భగీరథ (Mission Bhagiratha) తదితర శాఖల్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వారీగా పోస్టింగులు ఇచ్చింది.
అయితే సరైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో శాఖల మధ్య సమన్వయం లోపించింది. దీంతో వీఆర్ఏలకు కొత్త శాఖల్లో ఐడీలు జనరేట్ కాలేదు. దీంతో మూడు నెలలుగా శాలరీలు (Salaries) లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీఆర్ఏ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కుటుంబాలను ఎలాపోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పాల బిల్లు, కిరాణా బిల్లు, ఈఎంఐలు (EMI) అంటూ సవాలక్ష సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే మూడు నెలలుగా జీతాలు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చు.