»Rtc Bus For The First Time In 70 Years History Celebrations In Sitakkas Hometown
RTC Bus: 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఆర్టీసీ బస్సు..సీతక్క స్వగ్రామంలో సంబరాలు
70 ఏళ్ల చరిత్రలో సీతక్క స్వగ్రామానికి బస్సు సౌకర్యం లేదు. అయితే మంత్రిగా సీతక్క అడుగుపెట్టిన తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టింది. ములుగు మండలంలోని సీతక్క స్వగ్రామం అయిన జగ్గన్నపేటతో సహా 8 గ్రామాల మీదుగా వెళ్లేందుకు ఆర్టీసీ బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. ఆ బస్సును రోజూ మూడు ట్రిప్పులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ (Telangana)లో ఇప్పటి వరకూ ఆర్టీసీ బస్సులు నడవని గ్రామాలున్నాయి. అందులో తెలంగాణ మంత్రి సీతక్క (Minister seethakka) స్వగ్రామం జగ్గన్నపేట కూడా ఉంది. 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఆ ఊరికి చేరని ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు సైతం వెళ్తున్నాయి. ఇదంతా సీతక్క చలువే. మంత్రి అయిన తర్వాత ఆమె స్వగ్రామం మీదుగా ఎనిమిది ఊర్లను కలుపుతూ ఆర్టీసీ బస్సు వేశారు. దీంతో ఆ ఊర్ల గ్రామస్తులు ఆనందంతో మురిసిపోతున్నారు. తమ బిడ్డ మంత్రి అవ్వడం వల్లే ఊరికి బస్సు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా ఏజెన్సీలో ఇప్పటికీ అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఇది చాలా మందికి నమ్మశక్యం కాని విషయం. అందులో మంత్రి సీతక్క స్వగ్రామం అయిన ములుగు మండలంలోని జగ్గన్నపేట కూడా ఉంది. మారుమూల పల్లెకు ఇప్పుడు సీతక్క మంత్రి కాగానే ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టింది. ములుగు నుంచి మదనపల్లి, జగ్గన్నపేట, చింతలపల్లి, పత్తిపల్లి మీదుగా పొట్లాపూర్ వరకూ ఆర్టీసీ బస్సు రోజుకు మూడు ట్రిప్పులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఒకప్పుడు ఈ గ్రామాలకు మండల అధికారులు రావాలంటే ఆటోలు, ప్రైవేటు వాహనాల మీదే వచ్చేవారు. గతంలో అనేక సార్లు ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ఆర్టీసీ బస్సు వేయాలని అధికారులకు విన్నవించినా లాభం లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రాలు అందించినా లాభం లేదు. సీతక్క కూడా అనేక సందర్భాల్లో తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మొర పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీతక్క మంత్రికాగానే అధికారులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు. దీంతో 8 గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.