CM Revanth: పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు, కేటీఆర్‌పై సీఎం రేవంత్ విసుర్లు
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. మధ్యలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క కల్పించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.
CM Revanth: తెలంగాణ అసెంబ్లీలో చాలా రోజుల తర్వాత మాటల యుద్దం జరిగింది. సెషన్ స్టార్ట్ కాగానే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పేరును స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని సభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలిపే చర్చలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగాన్ని తప్పు పట్టారు. ఆ క్రమంలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క.. ఓ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కూడా స్పందించారు.
వెయ్యి ఎలుకలు తిన్న పిల్లిలా
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉందో అర్థమైందని కేటీఆర్ స్టార్ట్ చేశారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు.. చేయాల్సిన దారుణాలు చేసి.. పదేళ్లు అధికారంలో ఉన్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని తెలిపారు. ఆ క్రమంలోనే జగిత్యాలకు చెందిన అలిశెట్టి ప్రభాకర్.. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంక ఎవరినీ మోసగించనని.. ఒక పులి పశ్చాతాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు.. అలా ఉంది గవర్నర్ ప్రసంగం.. అందులో అసత్యాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అప్పటికీ, ఇప్పటికీ తాము ఎప్పుడూ ప్రజా పక్షం.. కాంగ్రెస్ పార్టీకి విపక్షమేనని కేటీఆర్ అన్నారు.
పడావు పడ్డ భూములు
2014కి ముందు తెలంగాణ ఘనత వీరి పాలనలో అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. పడావు పడ్డ భూములు, పాడుబడ్డ ఇళ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, నెర్రలు బారిన నేలలు, తాగునీటికి, సాగునీటికి దిక్కులేదని విరుచుకుపడ్డారు. 50 ఏళ్లు పాలించి ఏం చేశారు.. నల్గొండలో ఫ్లోరొసిస్ అలానే ఉంది. లక్షన్నర మంది ఇబ్బంది పడ్డారని తెలిపారు. పాలమూరు నుంచి ఏటా 14 లక్షల వలసలు వెళ్లేవారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ నియోజకవర్గం.. కొడంగల్ నుంచి 2 బస్సులు మహారాష్ట్ర వెళ్లేవని తెలిపారు. వలసల సమయంలో మహిళల నుంచి సలాసల కారే కన్నీళ్లు వచ్చేవని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరులో 50 ఎకరాల భూమి ఉన్న ఆసామి అయిన సరే మేస్త్రీగా పనిచేసే వారని గుర్తుచేశారు.
పైన పటారం.. లోన లొటారం
ఆ వెంటనే మంత్రి పొన్న ప్రభాకర్ కల్పించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం జరిగిందనే కదా.. రాష్ట్రం కోసం పోరాడిందని గుర్తుచేశారు. పైన పటారం.. లోన లొటారం తరహాలో గత ప్రభుత్వం పాలించిందని తెలిపారు. ఉపర్ షెర్వానీ.. అందర్ పరేషాని అన్నట్టు బీఆర్ఎస్ పాలన కొనసాగిందని విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతగా వాస్తవాలు మాట్లాడాలి గానీ.. మా తాతల మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారని చెబితే కుదరదని పొన్నం ప్రభాకర్ అన్నారు.
నిర్మాణాత్మక సూచనలు ఇస్తే ఓకే
ఆ వెంటనే మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇంతలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కల్పించుకున్నారు. ప్రభుత్వం మారింది. ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుదాం, సభను నడుపుదాం, నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటాం అని తెలిపారు. గవర్నర్ ప్రసంగం మీద స్వాగతిస్తున్నాం అని చెప్పాలి కానీ.. తొలి రోజే దాడి చేయడం సరికాదని సూచించారు. రూ.43 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథతో ఇప్పటికీ నీరు వస్తోందా అని అడిగారు. నల్గొండలో ఫ్లోరొసిస్ భూతాన్ని తరిమింది తమ ప్రభుత్వం అని స్పష్టంచేశారు.
55 ఏళ్ల విధ్వంసం
తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడితే 55 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడొద్దా అని అడిగారు. సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ కష్టాలు అని మళ్లీ స్టార్ట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు చెబితే బాగుండేదని.. దానిని స్వాగతించే వారమని తెలిపారు. అలా కేటీఆర్ వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మధ్యలో రేవంత్ కల్పించుకుని.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అచ్చొసిన అంబోతులం.. పోడియం వద్దకు దూసుకొస్తాం అంటే ఎలా అన్నారు. దాంతో మళ్లీ మాటల యుద్ధం జరిగింది.