Renuka Choudhary: రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన రాజకీయ స్వలాభం కోసం కాదని ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి (Renuka Choudhary) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల కేసీఆర్ ఇల్లు నిండిందని.. బంగారం మొత్తం ఆయన ఇంటికి చేరిందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాదని కేసీఆర్‌ను గెలిపిస్తే చేసిందేమి లేదని విరుచుకుపడ్డారు. ధరణి పోర్టల్‌తో భూములు కాజేశారని ఆరోపించారు. ధరణి వల్ల సామాన్యుడికి మేలు జరిగిందా అని అడిగారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఏమయ్యిందని రేణుకా చౌదరి (Renuka Choudhary) అడిగారు. ప్రాజెక్ట్ పక్కన ఊళ్ల గురించి.. ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదన్నారు. ఆ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఒప్పుకొని చెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ విద్య ఏమైందని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని.. ఒక్కరిపై రూ.లక్షకు పైగా అప్పు ఉందన్నారు.
దొంగ విత్తనాలు విక్రయించడంతో వేలాది రైతు కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని వివరించారు. ఇంత జరిగిన కేసీఆర్ స్పందించలేదని దుయ్యబట్టారు. కౌలు రైతుల సంక్షేమాన్ని సర్కార్ విస్మరించిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతుల మేలు కోసం పనిచేస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి సెగలు రేపుతోంది. కాంగ్రెస్- బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరస పర్యటనలు చేస్తున్నారు. ఇటు సీఎం కేసీఆర్.. రోజు 2, లేదంటే 3 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.