Rahul Gandi: ఈడీ, సీబీఐ విచారణ కేసీఆర్పై ఎందుకు జరపట్లేదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దేశంలోనే అవినీతి అంతా ఇక్కడే ఉందని భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో రాహుల్ ఆరోపించారు. ఇంకా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandi: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆసన్నం అవుతున్నాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో భూపాలపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ బస్సు యాత్రలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కారణంగా ఇక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈడీ, సీబీఐ విచారణ కేసీఆర్పై ఎందుకు జరపట్లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపిపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపి తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చింది. ఆఖరికి రైతు చట్టాలకు కూడా మద్ధతు తెలిపిందన్నారు. అందుకే వీరిపై దాడులు చేయడం లేదన్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్నారు. కేవలం ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్ను నియంత్రిస్తున్నారని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే అందరినీ పరిపాలనలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. కేసీఆర్ క్రమంగా ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికే పరిమితమైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేదలు, రైతుల సర్కార్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేద మహిళలకు ప్రతి నెలా రూ.2500, రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్తుందో చూస్తున్నాని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని రాహుల్ స్పష్టం చేశారు.