CM Jagan: గతంలో జరగనిది ఇప్పుడెలా జరిగిందో ప్రజలు ఆలోచించాలి
గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని..రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో జరగని అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లనే సాధ్యమైందని అన్నారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు మారాయని ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గురించి మాట్లాడుతూ.. గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని అన్నారు. రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని, అయినా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని తెలిపారు. అదెలా సాధ్యమైందో ఆలోచించాలని ప్రజలను కోరారు. కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు(yemmiganur)లో గురువారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించిన క్రమంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల చేశారు.
గతంలో పొదుపు సంఘాల మహిళల సమస్యలు తొలగిపోవాలంటే చంద్రబాబు పాలన రావాలంటూ టీవీల్లో యాడ్స్ వచ్చేవన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, సీఎం అయ్యాడు. అయినా పొదుపు సంఘాల మహిళల కష్టాలు మాత్రం తీరలేదని పేర్కొన్నారు. ఉన్న కష్టాలు తీరకపోగా సున్నా వడ్డీ పథకం కూడా చంద్రబాబు ఎత్తేశారని విమర్శించారు. రైతన్నలకూ ఇదే పరిస్థితి ఎదురైందని, పంట రుణాల మాఫీ విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్షించారు. గత ప్రభుత్వం దోపిడి చేసే గజదొంగలకు నిలయంగా మారిందని వెల్లడించారు. నేడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక నోటికి వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముకలా మారుస్తానని పాదయాత్రలో మాటిచ్చా. ఈరోజు సగర్వంగా తలెత్తుకుని చెప్తున్నా నా ఎస్సీ, ఎస్టీ, బీసీలను చేయి పట్టుకుని నడిపిస్తున్నా.