ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కూడా తెలియని వ్యక్తి దాని గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సీఎం కేసీఆర్ (CM KCR)పై విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. అసలు కేసీఆర్కు ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని తెలిపారు. తన పేరు చెప్పకుండా ఎన్నో మాటలు అన్నారని పొంగులేటి కేసీఆర్పై మండిపడ్డారు.
నిన్నటి సభలో సీఎం కేసీఆర్ పక్కన కూర్చున్నది ఎవరు? ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో గెలిచిన వాళ్లని పక్కన పెట్టుకుని కేసీఆర్ నీతులు చెబుతున్నాడని పొంగులేటి అన్నారు. పైరవీలతో డబ్బు సంపాదించలేదు. తాను తడి బట్టలతో గుడికి వస్తా.. మీరు కూడా తడి బట్టలతో గుడికి రండి అని పొంగులేటి కేసీఆర్కు సవాల్ విసిరారు. అక్రమంగా డబ్బు సంపాదించానని కేసీఆర్ అంటున్నారు. కానీ తాను కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో చెప్పగలనని పొంగులేటి అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను దోచుకుని కేసీఆర్ దాచుకున్నారని పొంగులేటి అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఏమైంది. కేసీఆర్ పతనానికి మేడిగడ్డ చివరి మెట్టని పొంగులేటి వ్యాఖ్యనించారు.