మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు జరిపిన దాడుల్లో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.. ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు కొంతకాలంగా సమాచారం ఉంది. దీంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట శిబిరం నుంచి భారీ ఎత్తున నగదు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లక్షల్లో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత నోటీసులిచ్చి వదిలేసినట్లు సమాచారం. కాగా, ఈ దాడుల్లో తాను పట్టుబడ్డట్లు జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ మేయర్ శివ కుమార్ స్పందించారు. పేకాటతో తనకేం సంబంధం లేదని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేకే కుట్రలు పన్నినట్లు చెప్పారు. కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో దాడులు జరిగాయని, ఆ ఆఫీస్ పక్కనే తన కార్యాలయం ఉండటంతో తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన అన్నారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.