NLG: మాతృభాష పరిరక్షణ మనందరి బాధ్యత అని గ్రంథాలయ ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేతేపల్లి మండలం, భీమవరం జి.ప.ఉ.పాఠశాలలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషా ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పాలన్నారు. అభివృద్ధికి మాతృభాషనే పునాది అని, ఇందులో పట్టుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు.
ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎస్పీకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.
KMM: హైదరాబాద్‌కు విచ్చేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేంద్రం నుండి ఒక్క ఇల్లు కూడా సాధించలేకపోయిందని, కానీ, ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఇప్పటికే 11.57 లక్షల మంది అర్హులను గుర్తించిందని ఆయన పేర్కొన్నారు.
SRCL: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా బాలికలు, మహిళలు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సూచించారు.
WNP: వనపర్తి పట్టణంలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రెడ్ బుక్స్ డే ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నాయకుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మికుల హక్కులు మొదలగు వాటి గురించి రెడ్ బుక్స్ ద్వారా తెలిసిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MBNR: జడ్చర్లలోని డా.బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్లం, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ విభాగాలన్ని కలిసి ఘనంగా మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య పాల్గొని మాట్లాడారు. మనిషి వికాసం మాతృభాషతో జరుగుతుందన్నారు. భాష అమ్మలాంటిదని, అమ్మను ప్రేమించినట్లు భాషను ప్రేమించి, గౌరవించాలన్నారు.
NGKL: ఊర్కొండ మండలం బొమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన గోవిందు విజయ్ యాదవ్ కుమారుడు గోవిందు తులసీధర్ రాష్ట్రస్థాయి దివ్యంగా క్రీడల్లో చక్కని ప్రతిభ కనబరిచి తన సత్తాను చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్, జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు అతడికి అభినందనలు తెలిపారు.
GDWL: అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంను ‘బలగం’ చిత్ర దర్శకుడు, సినీ నటుడు వేణు యెల్దండి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది సురేశ్ పాల్గొన్నారు.
KNR: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనకు మహేష్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లింగ, ధనిక, పేద, మత ఏ ఇతర వాటితో సంబంధం లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందించేలా చట్టాలు రూపొందించబడ్డాయని అన్నారు.
MHBD: దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామ సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ కార్యక్రమానికి అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల సౌకర్యార్థం శిబిరాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయ విషయమన్నారు. తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ బట్టునాయక్ తదితరులున్నారు.
KMR: ఖాదీ అంటే కలెక్షన్లు కాదని, సర్వీస్ అనే దిశగా తాను పని చేస్తున్నట్లు MLA కె.వి రమణారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చానని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పుకుంటూ ఇంచార్జీ మంత్రిని తీసుకువచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
MNCL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈనెల 23 నుంచి నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్‌లో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని వెల్లడించారు.
KMM: వైరా నియోజకవర్గం పాత తండాలోని రైతు వేదికలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన జాతి అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ASF: కాగజ్ నగర్ సంఘం బస్తీలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న పలువురికి గాయాలవ్వగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద తీవ్రతకు ఇంటి సామాగ్రి ధ్వంసమైంది. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పుష్కరని వద్ద జరిగిన కరుణాకర్ హత్య కేసును పోలీసులు చేదించారు. పోలీసుల వివరాలు.. గత ఆరేళ్లుగా కలిసి ఉంటున్న కరుణాకర్, బాలమని శివరాత్రి జాతర సందర్భంగా పుష్కరిని వద్ద మద్యం సేవించారు. డబ్బులు విషయంలో వాగ్వాదం జరగడంతో కరుణాకర్ పై కట్టెతో బాలమణి దాడి చేసి పుష్కరిణిలో తోసేయగా మృతి చెందాడు. నిందితురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేశారు.