JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తే ముందుకు సాగాలని అన్నారు.
BHPL: రేపటి నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయనున్న విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భయం లేకుండా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. సరైన ప్రణాళికతో చదవడం, సమయపాలన పాటించడం ముఖ్యమని, ఇప్పటి వరకు చేసిన చదువుపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా రాస్తే మంచి ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని ఫత్తేపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కిడ్నీలు ఇన్ఫెక్షన్ కావడంతో కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స అవసరమని, దీనికి సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. అంతా డబ్బు చెల్లించే స్తోమత లేక ఆ నిరుపేద కుటుంబం దాతల కోసం ఎదురుచూస్తుంది.
GDWL: గద్వాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు బారులు తీరారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో శుక్రవారం స్థానిక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాల వద్ద వినియోగదారులు సిలిండర్ల కోసం క్యూ కట్టారు. కాగా, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని ఆటో, లారీ డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారికి కంటి పరీక్షలు, ECG పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ రత్నం హాజరయ్యారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
RR: నందిగామ మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కొమ్ము కృష్ణ ఆధ్వర్యంలో ఇంటి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి బిందెలు, బకెట్లు, వాటర్ సంపులను క్లీనింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
VKB: బషీరాబాద్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. భక్తుల సౌకర్యార్థం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను కేటాయించింది. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయడం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 11వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్ పర్సన్, పాలకవర్గం సభ్యులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలుషిత నీరు తాగవద్దని సూచించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని అన్నారు.
MBNR: మిడ్జిల్ మండలంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసి వారు విన్నవించారు. స్పందించిన మాజీ మంత్రి విగ్రహ ఏర్పాటుకు రూ. 5,50,000 విరాళాన్ని ప్రకటించారు. అలాగే నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయానికి కూడా తన వంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యారు. మహిళా కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే మహిళలకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించాలని చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణకు మంత్రి సూచించారు.
SRPT: తుంగతుర్తి మండలం అన్నారంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని శనివారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పశుపోషకులు నిర్లక్ష్యం చేయకుండా తమ పశువులకు టీకాలు వేయించాలని కోరారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
NGKL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ మండలంలోని మంతటి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
HNK: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత FMD టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం MLA KR నాగరాజు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. ప్రతి ఆరు నెలలకు ఉచితంగా FMD టీకాలు వేస్తున్నామని, పశుసంపదను రక్షించి పాల ఉత్పత్తి పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
NLG: నూతన ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటించి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
KNR: గంగాధర (M) నారాయణపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. రిజర్వాయర్ నిండితే తమ ఇళ్లలోకి నీరు చేరి సర్వం కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పాలకులు విస్మరించారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.