NRPT: మరికల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్య లక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. హాజరు పట్టికను, ఓపీ రిజిస్టర్ తనిఖీ చేశారు. నెలలో జరిగిన ప్రసవాల సంఖ్యను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
NGKL: అచ్చంపేటలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో 2025-26 గానూ 5వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ కే.యాదగిరి తెలిపారు. 30 సీట్లు మైనారిటీలకు, 10 సీట్లు ఇతరులకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు https://cet.cgg.gov.in/tmreisలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MBNR: ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఓ మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కంసాన్పల్లికి చెందిన నారమ్మ(32) తీవ్ర అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NGKL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సంక్షేమపథకాలు అర్హులైన అందరికీ లబ్ధి చేకూర్చుతామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం గుడిపల్లిలో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
MDK: మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 25న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, ప్రగతి, పాఠశాల అభివృద్ధిపై చర్చించాలని, దీనికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.
SRD: సిర్గాపూర్ మండలం పోచాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారుకు సీఎం సహాయనిధి చెక్కును ఖేడ్ ఎమ్మెల్యే సోదరుడు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి మంగళవారం తమ నివాసంలో అందజేశారు. పోచాపూర్కు చెందిన బేగరి శంకర్ అత్యవసర ఆస్పత్రి ఖర్చులకు మంజూరైన రూ. 15 వేలు CMRF చెక్కును అందజేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి ఉన్నారు.
SRD: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణఖేడ్ MLA సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం ఖేడ్ మండలంలోని చాంద్ ఖాన్ పేట మంగళపేటలో నిర్వహించిన ప్రజా పాలన మున్సిపాలిటీ వార్డు సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
MHBD: దంతాలపల్లి మండలం గున్నేపల్లి ప్రజా పాలన గ్రామ సభలో నేడు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గ్రామ సభలో అధికారులు లబ్ధిదారుల వివరాలను ప్రకటించారు.
MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నేడు కల్లు గీత కార్మిక సంఘం సభ్యులు నిరసన తెలిపారు. సంఘం బాధ్యులు సోమయ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు.
NRPT: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణీకారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని అశోక్ నగర్లో వార్డు సభను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల పేర్లను మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
JN: జనగామ మండలం శామీర్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామసభలో మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు.
WGL: నేటి నుంచి ప్రారంభమైన గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా నగరంలో డివిజన్ల పరిధిలో జరుగుతున్న గ్రామ సభలకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరువుతున్నారు. ఇందులో భాగంగా 22వ డివిజన్వలో నిర్వహించిన గ్రామ సభకు పోలీస్ కమిషనర్ పాల్గొని పోలీస్ బందోబస్తుతో పాటు సభ ఏర్పాట్లును పరిశీలించారు. గ్రామ సభలకు ప్రజలు సహకరించాలని సీపీ సూచించారు.
WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో నేడు పోలిస్తే మిర్చి ధరలు పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర సోమవారం రూ.14,700 ధర పలకగా.. నేడు రూ.15,300 పలికింది. అలాగే వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.12,700 ధర రాగా.. నేడు రూ. 13,500 ధర వచ్చింది. మరోవైపు 341 రకం మిర్చి సోమవారం రూ.15,500 పలకగా.. నేడు రూ.15,100 పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
మహబూబాబాద్: గూడూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాదులోని మల్టీ జోన్-1 ఐజి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సుదీర్ఘ కాలంగా గూడూరు సీఐగా పనిచేసిన బాబురావు సేవలను స్థానికులు గుర్తు చేస్తున్నారు. కాగా గూడూరు నూతన సీఐగా జి. సూర్య ప్రకాష్ నియమింపబడ్డారు.
HYD: యాకుతురాలోని యాకుత్ మహల్ టాకీస్ వద్ద సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు ఉన్నాయి. గత 15 రోజులుగా రోడ్లపై మురుగునీరు చేరి మరింత ఇబ్బందికరంగా మారింది. సిబ్బంది మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోయారు. మజ్లిస్ బచావో తారిక్ పార్టీ చీఫ్ అంజాద్ ఉల్లాఖాన్ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తెచ్చారు.