నల్గొండ: కేతపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వాళ్లు వీళ్లు ఇచ్చిన మందు బాటిల్స్ తాగి కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండల పార్టీ అధ్యక్షులు శ్రీను మండిపడ్డారు. ఏదైనా ఆధారాలతో ముందుకొస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
VKB: జిల్లా వ్యాప్తంగా 2026 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 61 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం గణనీయంగా నమోదైనట్లు తెలిపారు. ప్రజలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ నియమాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
MDCL: ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వారం రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 13 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
NRML: మామడ మండలం చందరం–బండల్ ఖానాపూర్ అటవీ ప్రాంతంలో జింక ఒక్కసారిగా వాహనం ముందుకు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పొనకల్ గ్రామానికి చెందిన బి. భీమేష్ (35), వినీత్ (27), లక్ష్మి (50) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రలను వెంటనే ప్రథమ చికిత్స అందించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఈఎంటీ వై. సురేష్, పైలట్ హఫీజ్ సహకారంతో బాధితులకు సహాయం అందించారు.
MNCL: నీటిని పొదుపుగా వాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాలని దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. ఆదివారం దండేపల్లి మండలంలోని చెల్కగూడా గ్రామంలో మిషన్ భగీరథ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ప్రాముఖ్యత గురించి అధికారులు వివరించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందని తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది.. సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భీమేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట ఎల్‌ఈడీలో రాజరాజేశ్వరి స్వామి వారి మూల విరాట్‌ను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
NGKL: జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీగా బావాయిపల్లి వాసి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామక పత్రాన్ని విడుదల చేసింది. తన నియామకానికి సహకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
GDWL: అలంపూర్ మున్సిపాలిటీలో శాశ్వత ఏఈ లేకపోవడం వల్ల మున్సిపాలిటీ పనులు నిలిచిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా ఉన్న ఏఈ కూడా అందుబాటులో లేక ప్రజలు కార్యాలయానికి వెళ్లినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే శాశ్వత ఏఈని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
WGL: నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామంలో రూ.10 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు.
MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని యెల్దుర్తి మండల మానేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జాతరను నిర్వహించారు.
MNCL: పంట వేసిన ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొండ గొర్ల లింగన్న కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటలు వేసేందుకు ప్రభుత్వం అందించే రైతు భరోసా డబ్బులు ఇవ్వడంలో జాప్యం ఎక్కువగా జరుగుతుందన్నారు. దీంతో పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
MDCL: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల రిపోర్టును అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 44 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అల్వాల్, గోపులారం ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 11 కేసుల నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం రెట్టింపు అవుతుందన్నారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటనలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల్లోనే నాలుగు సంఘటనలు చోటుచేసుకోవడంతో మహిళల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ద్విచక్ర వాహనాలపై వచ్చే దుండగులు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు లాక్కొని పారిపోతున్నారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
KMM: కల్లూరు మండలంలో యాసంగి ధాన్యం సేకరణకు త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రూప తెలిపారు. ఇటీవల మండలంలో వరి కోతలు ప్రారంభం కాగా ఇప్పటికే సుమారు 200 ఎకరాల్లో రైతులు పంటను కోశారని వెల్లడించారు. ఈ సీజన్‌లో మండల వ్యాప్తంగా దాదాపు 34 వేల ఎకరాల్లో యాసంగి వరి సాగు జరిగిందని ఆమె పేర్కొన్నారు.
HYD, RR, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచే దిశగా సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ వోకేషనల్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ టూల్స్ వినియోగంపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు.