BNR: భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 23వ వార్డులోని ఇందిరానగర్‌లో వార్డు సభ కార్యక్రమం బుధవారం స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ఆరు గ్యారెంటీ పథకాలు అర్హులైన నిరుపేద ప్రజలకు అందిస్తామన్నారు.
NLG: భారతీయ వాయుసేన.. అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ ఫార్మసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 27 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
HYD: ముస్లీం గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అన్నారు. బుధవారం రెయిన్ బజార్ డివిజన్ పరిధిలోని ముస్లీం గ్రేవ్ యార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రేవ్ యార్డులలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. MLA వెంట స్థానిక కార్పొరేటర్ వశీయుద్దీన్, కార్యకర్తలు ఉన్నారు.
KMR: ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కామరెడ్డి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. విజయ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల అధ్యాపక బృందం బుధవారం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. అధ్యాపకులు డా.శ్రీనివాస్, డా. విశ్వప్రసాద్, డా. సత్యం ఉన్నారు.
HYD: హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఐడీబీఐ బ్యాంక్ బుధవారం కుర్చీలు, కంప్యూటర్ టేబుల్స్, ఆంప్లిఫైర్, స్పీకర్ సెట్, బీరువా, వంట సామాన్లను అందజేసింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, ఐడీబీఐఆర్ హెచ్. సందీప్ పట్నాయక్, కూకట్‌పల్లి డీజీఎం మురళీధర్ పాల్గొన్నారు.
NLG: హుజూర్‌నగర్‌లోని టౌన్ హాల్లో బుధవారం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె కిడ్నీ ఎముకల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర INTUC ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరగాని నాగన్న గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
WNP: ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటిస్తూ కామన్ డైట్ మెనూ పక్కగా అమలు చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. బుధవారం సాయంత్రం వనపర్తిలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్‌ను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలన్నారు.
ADB: ఇచ్చోడ మండలంలోని బాదిగూడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు మత్తు పదార్థాలు, రోడ్డు భద్రత జాతీయ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై బుధవారం కళాజాత ప్రదర్శన నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. వాహనం నడిపే సమయంలో హెల్మెట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులున్నారు.
నాగర్ కర్నూల్: బల్మూరు మండలం చెన్నారం గ్రామ పంచాయతీల్లో విధులు సరిగా నిర్వర్తించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామంలో చేపట్టిన సభకు గైర్హాజరావడం, ఇతర అంశాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో బుధవారం పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
NRPT: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం సాయంత్రం నర్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారని డీఏం ఎచ్ ఓ సౌభాగ్యాలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వార్డులను, ఆవరణను పరిశీలించారు. 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి మంత్రిని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారు.
ADB: బేల మండలం డోప్టాల, భవానీగూడ గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సంక్షేమ పథకాలు నిరంతరంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
NRML: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో భాగంగా బుధవారం గాజులపేట్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్ల పట్టణంలోని బైల్ బజార్, గాజులపేట్ కాలనీలో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు 322, ఇందిరమ్మ ఇండ్లు 131 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఆన్ లైన్ జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
NRML: పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి మురళి అన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్మల్ మండలం డ్యాంగాపూర్, విశ్వనాథ్ పేటలో తనిఖీ నిర్వహించారు. గొర్రెల కాపరిగా పనిచేస్తున్న బాలుడిని గుర్తించి పాఠశాలలో చేర్పించడం జరిగిందని బాలుడిని పనిలో పెట్టుకున్న నిఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
NRML: అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అగ్నిమాపక శాఖ అధికారి శివాజీ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలోని ఆర్టీవో కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు.
NRML: అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం అయిన ఘటన సారంగాపూర్ మండలం రవీంద్ర నగర్ (బీ) చర్చి తండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక రైతు జాదవ్ రూప్ సింగ్ తన ఐదు ఎకరాల చేనులో మొక్కజొన్న పంట వేయాగా, చేతికి వచ్చే సమయానికి అడవి పందులు దాడి చేసి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో రైతు ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకున్నారు