NRML: నిర్మల్ కలెక్టరేట్లో మంగళవారం, బుధవారం జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు డీపీఆర్వో విష్ణు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఈ వైద్య శిబిరం ఉంటుందన్నారు.
NRML: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి ఎంపీడీవో కార్యాలయాల్లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళకు ఆయన భూమి పూజ చేశారు.
WGL: తెలంగాణ సెక్రటేరియట్ మాజీ సీఎస్‌వో, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ టి.గంగారాం మృతి పట్ల మంత్రి సురేఖ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణంపై మంత్రి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కమాండెంట్ గంగారాం ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబీకులు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని అన్నారు.
ASF: సిర్పూర్(యు)లోని దేవులపల్లి గ్రామానికి చెందిన ఆత్రం శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాదులోని వెల్నెస్ కేంద్రంలో గత కొన్ని రోజులుగా మెరుగైన చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంఛార్జ్ ఆత్రం సుగుణ మంగళవారం ఆస్పత్రికి చేరుకొని శ్రీకాంత్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
MNCL: జిల్లా కేంద్రంలో మంగళవారం టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్, సమిష్టి చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలకు నారీ శక్తి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకుడు సునార్కర్ రాంబాబు, పుడ్ కార్పొరేషన్ సభ్యుడు డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్ పాల్గొన్నారు.
ADB: కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతిఒక్క నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం హైదరాబాదులోని తమ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ బలోపేతానికి కార్యకర్త నుంచి నాయకుల వరకు కృషి చేయాలని కోరారు.
KMR: బీబీపేట్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు మెడికల్ ఆఫీసర్ డా.భానుప్రియ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. అవసరం మేరకు రక్త పరీక్షలు చేసి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించినట్లు తెలిపారు.
WGL: పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన విద్యార్థిని శ్రీ చైతన్య ఇటీవల ఖమ్మం పట్టణంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈరోజు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యార్థినికి శాలువ కప్పి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, కరాటే శరీర ధృత్వానికి, స్వీయ రక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
WGL: ఎనుమాముల మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారస్థులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
HYD: కార్వాన్ డివిజన్ పరిధిలోని దర్బార్ మైసమ్మ ఆలయానికి వెళ్లేదారి అధ్వానంగా తయారైంది. చాలా ప్రాంతాల్లో రోడ్డు గుంతలు పడడంతో ప్రయాణానికి ఇబ్బందులు తప్పడం లేదు. తరచూ మరమ్మతులు చేపట్టి వదిలేస్తున్నారని, అయినా సమస్య పూర్తిగా పరిష్కారం కావడంలేదని తెలిపారు. నూతన రోడ్డు పనులు చేపడితేనే సులువుగా ఉంటుందని స్థానికులు కోరారు.
HYD: నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ఠంగా 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. HYDలో మధ్యాహ్నం 2, 3 గం.ల వరకు సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. ఏప్రిల్, మే నెలలో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మేడ్చల్: జీడిమెట్ల డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని హరిహర అయ్యప్ప దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలు ఈనెల 11 నుంచి 13 వరకు కొనసాగుతాయన్నారు. మంగళవారం మహాగణపతిపూజ, ప్రసాదశుద్ధి, స్థలశుద్ధి, మహాగణపతిహోమం, వాస్తుహోమం, బుధవారం మహాగణపతిహోమం, కలశపూజ, ధ్వజారోహణం, పడిపూజ ఉంటాయన్నారు.
KMR: బిక్కనూర్ బీ సీ బాలుర వసతి గృహంలో ఉంటూ 8వ తరగతి చదువుతున్న విద్యార్థి రినీత్ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు బీసీ వెల్ఫేర్ అధికారిని సునీత తెలిపారు. జిల్లాస్థాయిలో జరిగిన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు.విద్యార్థి రినీత్ నుఉపాధ్యాయులతో పాటు వసతి గృహ సిబ్బంది అభినందించారు.
HYD: తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో కొత్త ఎస్పీగా రూపేశ్, ఐపీఎస్, సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రూపేశ్ నేతృత్వంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.
HYD: మంత్రి సీతక్క సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. హెల్ప్ లైన్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడిన సీతక్క.. డయల్ 181 ద్వారా కాల్ సెంటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ ను స్వయంగా అటెండ్ చేసి, బాధితురాలి ఆవేదన విన్నారు. తన భర్త వేధిస్తున్నాడని లలిత అనే మహిళ ఫోన్ చేయగా మాట్లాడారు.