BDK: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పందన పాల్గొని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రయాణంలో ఉన్నప్పుడు డ్రైవర్లు గుండెపోటుకు గురైతే అత్యవసరంగా సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు రక్షించవచ్చని తెలిపారు.
KMM: ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర నాయకులు నిమ్మటూరు రామకృష్ణ అన్నారు. తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంఈఓ దామోదర్ ప్రసాద్‌కు అందించారు.
మేడ్చల్: మేడ్చల్ మండలం మునీరాబాద్ గ్రామంలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఓ యువతి(25)ని దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం కాలిపోయింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్: ప్రజలు అందరూ లోన్ యాప్‌తో అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ సీఐ టీ.నర్సింహరాజు హెచ్చరించారు. లోన్ యాప్‌లో రుణాలు తీసుకొని వారి నుంచి వచ్చే వత్తిడితో డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలానగర్ పరిధిలో గల వినాయకనగర్‌కు చెందిన తరుణ్ రెడ్డి ఘటనతో మేల్కొని ప్రజలు, ముఖ్యంగా యువత లోన్ యాప్‌లను ఆశ్రయించొద్దని హెచ్చరించారు.
ADB: ఇచ్చోడ మండలంలోని దబా(బీ) గ్రామంలో టైగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఆడే గజేందర్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
WGL:హనుమకొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ భవన్‌లో నేడు బాలిక దినోత్సవం వేడుకలను జ్యోతి ప్రజ్వలన గావించి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఐసిడిఎస్ జిల్లా అధికారి జయంతి ఆధ్వర్యంలో బాలిక దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్యతోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ADB: నేరడిగొండ మండలంలోని కొరటికల్ గ్రామంలో మథుర సమాజ్ ఆధ్వర్యంలో బండార పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏలేటి అశ్విన్ రెడ్డి పాల్గొన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పండుగలు నిర్వహించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
JN: జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో నేడు జిల్లాస్థాయి క్రికెట్ క్రీడా పోటీల ముగింపు సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. టాస్ వేసి ఫైనల్ మ్యాచ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫైనల్ మ్యాచ్ చేరిన క్రీడాకారులను పరిచయం చేసుకోవడంతోపాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న వ్యక్తులను అభినందించారు.
JN: ప్రజాపాలన గ్రామ/వార్డు సభల అభ్యంతరాల దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం ప్రజాపాలన సభల్లో వచ్చిన రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా సర్వే పరిశీలన అభ్యంతరాల దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.
ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతన అంగన్ వాడి భవన నిర్మాణం, సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. సమిష్టిగా పనిచేసే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
MNCL: జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కెమిస్ట్స్&డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏఐఓసీడీ అధ్యక్షుడు జగనాథ్ షిండే 75వ జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు స్వచ్చందంగా రక్తదానం చేశారు.
ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నెలకొన్న నాగోబా దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలాంతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న నాగోబా జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షాను అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాట సమితి నాయకులు శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. కైలాష్ నగర్‌లో గల న్యూ అంబేద్కర్ భవనం ఎదురుగా ఉన్నటువంటి పాత బిల్డింగ్‌ని సీనియర్ సిటిజన్లకు కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు.
MBNR: మహబూబ్‌నగర్ పట్టణం పెద్ద చెరువు దగ్గర నిర్మాణం చేపట్టిన స్టామ్ వాటర్ కెనాల్ పనులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి, పరిశీలించారు. అలాగే, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
MNCL: పోరాటాలతోనే నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయని జన్నారం మండల నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కస్తూలాపురి నాగేందర్ సూచించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం జన్నారం పట్టణంలో నాయి బ్రాహ్మణ, బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సంఘంల ఆధ్వర్యంలో కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.