MHBD: జిల్లా ఈదులపూసపెళ్లి సమీపంలోని మూలమలుపు వద్ద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ టాటా ఏసీ వాహనం అదుపుతప్పి బలంగా చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు గాయపడిన వెంకన్నను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి కష్టాలు తొలగి, విజయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులు నిండాలని, సమాజంలో ఆధ్యాత్మికత పెరగాలని కోరుకుంటూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సవాల మధ్య ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన సందేశమిచ్చారు.
HYD: ఉగాది పర్వదినానికి ప్రతీకగా నిలిచే షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడిలో కీలకమైన చేదు రుచి ఈసారి దుర్లభమైంది. ఫంగస్ తెగుళ్లు విస్తృతంగా ప్రబలడంతో వేప పువ్వు కొరత నెలకొంది. HYD నగరంతో పాటు పరిసర శివారు ప్రాంతాల్లోనూ వేప పువ్వు అందుబాటులో లేదు. కొందరు ఇతర జిల్లాల నుంచి తెచ్చిన వేప పువ్వును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చిన్న రెమ్మకే రూ. 25 వసూలు చేస్తున్నారు.
గద్వాల జిల్లా సమీపంలో వెలసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి గురువారం పరాభవ నామ సంవత్సరాది ఉగాది సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి కృష్ణా నది జరాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ భక్తులు హాజరైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
సూర్యాపేట జిల్లా ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పరాభవ నామ సంవత్సరంలో అంతా మంచే జరగాలని, ప్రజలందరి జీవితాల్లో ఆశలు చిగురించాలని కోరారు. ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులతో పాటు అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ సమ్మక్క హత్య కేసులో నిందితుడు కేర్కర్ జలపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి, ఆమె గర్భం దాల్చడంతో అడవిలోకి తీసుకెళ్లి నిందితుడు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగజ్ నగర్ DSP వహీదుద్దీన్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ తరలించారు.
JGL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మారుపాక వినోద్ స్మారకార్థం అతని స్నేహితులు కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ ముందు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వినోద్ తండ్రి చేతుల మీదుగా ప్రారంభించారు. వినోద్‌పైన ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అతడి మిత్రులు తెలిపారు.
ADB: సర్పంచులు, కౌన్సిలర్లు తమ పరిధిలోని గ్రామాలను, వార్డులను గంజాయి రహితంగా మార్చాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ‘మూడవ కన్ను’లా పనిచేస్తాయని, ప్రతి ఒక్కరూ వీటి ఏర్పాటుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
NRPT: పరాభవ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని, పాడిపంటలతో కళకళలాడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకాంక్షించారు. ఆయన జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ ఎంతో విశిష్టమైందని అన్నారు. పండుగ రోజున షడ్రుచులు స్వీకరించడం చెప్పుకోదగ్గ విశేషమన్నారు.
BHNG: ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది అంటే కొత్త ఆరంభం.. చెడు జ్ఞాపకాలను వదిలి, మంచి ఆశలతో ముందుకు వెళ్లే సమయం. ఈ పరాభవ నామ సంవత్సరం మీ జీవితంలో అనేక ఆనందాలు, విజయాలు తీసుకురావాలి అని కోరుకున్నారు.
KNR: జమ్మికుంట పట్టణంలో బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ స్వప్న పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేలాది కూలీలకు పనులు కల్పిస్తున్నా, వసతుల లోపం తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తం 1.74 లక్షల జాబ్ కార్డులు, 3.20 లక్షల కూలీలు ఉండగా రోజూ 35 వేల మందికిపైగా పనులకు హాజరవుతున్నారు. అయితే పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి సదుపాయాలు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో 220 గ్రాముల నిషేధిత మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై NDPS చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరించారు.
NLG: రంజాన్ సందర్భంగా సాగర్ నియోజకవర్గంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. హాలియా లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్యక్రమం జరిగింది. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మతసామరస్యానికి రంజాన్ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చందర్ రావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణం లక్ష్మీ నగర్‌లో అరుదైన పక్షి తారసపడింది. సంతోశ్ కుమార్ తన ఇంటి సమీపంలో గాయంతో పడి ఉన్న పక్షిని చూసి ఏఐ సహకారంతో అరుదైన పక్షి జాతికి చెందిందని తెలుసుకున్నారు. వెంటనే స్థానికుల సహకారంతో అటవీశాఖ అధికారులకు అప్పగించారు. రాత్రి కురిసిన వర్షానికి గాయపడిన పక్షికి చికిత్స అందించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.