SRD: సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
MNCL: బెల్లంపల్లి మండలం బూద కలన్ గ్రామానికి చెందిన సర్పంచ్ దాడి నగేష్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నగేష్ గెలుపొందాడు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడనై కాంగ్రెస్‌లో చేరినట్లు అయన పేర్కొన్నారు.
ASF: సమగ్ర సర్వేతోనే భూ సమస్యల పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఆ భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను, జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, 163BNSS అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు.
PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షకు 97.89 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాధన జూనియర్ కళాశాలలో మొత్తం 571 మంది విద్యార్థులను కేటాయించగా, 559 మంది విద్యార్థులు హాజరయ్యారు. 12 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
ADB: అత్యవసర సమయాల్లో డయల్ 100ను సంప్రదించాలని పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్ అన్నారు. బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రం వద్ద ‘డయల్ 100’ అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పుండలీక్, సుధాకర్, నాగోరావ్, తదితరులు పాల్గొన్నారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని వల్లబ్ నగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్ పగిలిపోవడంతో నీరు రోడ్డుపైకి రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వాహనదారులు బుధవారం ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్పందించి మిషన్ భగీరథ అధికారులతో మరమత్తు పనులు నిర్వహించినట్టు తెలిపారు. సమస్యపై స్పందించిన చైర్మన్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
BDK: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో రెండు నెలల పసిపాపను తన్ని చంపేశారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని సీపీఎం పార్టీ పిలుపులో భాగంగా ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు.
KMM: పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామంలో బుధవారం శ్రీ షిరిడి సాయిబాబా గుడి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమాయి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు పాల్గొన్నారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,515 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21, 500 ధర పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.37 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.18,400, ఎల్లో మిర్చి రూ. 24వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
SRPT: నడిగూడెం క్లస్టర్ పరిధిలోని రైతులు ఈ నెల 28లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో పిచ్చయ్య కోరారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి ఈ నమోదు అవసరమని, రైతులు వెంటనే మీసేవ లేదా రైతు వేదికలో సంప్రదించాలని సూచించారు. నమోదు చేసుకోని పక్షంలో ప్రభుత్వ సాయం పొందే అవకాశం కోల్పోతారని ఆయన హెచ్చరించారు.
NZB: ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల భీంగల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ మృతి చెందాడు. చెవి నొప్పితో వచ్చిన అజయ్‌కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తుండగా పరిస్థితి విషమించింది. మత్తు మందు వికటించడం వల్లే అజయ్ చనిపోయాడని, ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట శవంతో బుధవారం ధర్నాకు దిగారు.
WNP: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగుతున్నట్లు చీఫ్ సూపర్డెంట్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. తొలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు మొత్తం 385 మంది విద్యార్థులకు ఘనం 370 మంది హాజరైనట్లు తెలిపారు. మిగతా 15 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయి అన్నారు.
KMR: కామారెడ్డి జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్య వేక్షణ, ప్రశ్నాపత్రాల భద్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
BHPL: జిల్లాలో మొదటి రోజు ఇంటర్ ఫస్టియర్ వార్షిక పరీక్షలు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 1,829 మంది విద్యార్థులకు గాను 1,772 మంది పరీక్షలు రాసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకన్న తెలిపారు. 96.88% హాజరు శాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు