NRML: మామడ మండలం పొన్కల్ గ్రామంలో 18 ఏళ్ల క్రితం పూడ్చివేతకు గురైన పురాతన కోనేరును గ్రామస్థులు, ఆలయ కమిటీ కలిసి పునరుద్ధరించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు, భక్తులు గోదావరి జలాలను తెచ్చి కోనేరులో పోసి పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక హోమం, కోనేరు హారతి వైభవంగా నిర్వహించగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు.
BHNG: ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుకవారం ఉదయం రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. VHP జిల్లా సత్సంగ్ పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు స్వామీజీ, చంద్రం, కృష్ణ భక్తులు పాల్గొన్నారు
JN: నల్గొండలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర-శిక్షణ మహా అభియాన్ వక్తల కార్యశాలకు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్‌లు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ… బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
PDPL: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్‌ను పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్ నుగిళ్ల మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను ఆత్మీయంగా కలిసి, ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఆయన అనుచరులు, పలువురు పాల్గొన్నారు.
ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఈ ఆర్థిక ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1.02 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 50% మాత్రమే వసూలైంది.మున్సిపాలిటీగా మారిన తరువాత యజమానుల వివరాల ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన 50% పన్ను వసూలు చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.
SRPT: కోదాడలో నేడు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10:15 గంటలకు పట్టణంలోని కటకమ్మగూడెం రోడ్లో నారాయణ హాస్పిటల్ ప్రారంభోత్సవం, 11:15 గంటలకు మోతే మండలం అన్నారిగూడెం గ్రామంలో గణేష్ కుమార్తె అన్నప్రాసన, పట్టణంలో సుధాకర్ రావు కుమారుడి వివాహానికి సాయంత్రం 6 గంటలకు పాల్గొంటున్నారు.
ADB: నార్నూరులో హోలీ పండుగకు ముందే ప్రకృతి రంగుల సంబరాలు ప్రారంభమయ్యాయి. అడవుల్లో మోదుగు చెట్లు ఎర్రటి జ్వాలల్లా వికసించి అరణ్యాన్ని అగ్నివర్ణంతో కప్పేశాయి. పచ్చని చెట్ల మధ్య మెరిసే ఈ ఎర్ర పూలు గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది మోదుగు పూలతో నార్నూర్ అరణ్యాలు హోలీకి సహజ రంగుల వేదికగా మారుతున్నాయి.
JN: దేవరుప్పులలో అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్సై సృజన్ కుమార్ మాట్లాడుతూ… వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
NGKL: కుమ్మెర బాధితులను పరామర్శించే తీరిక కాంగ్రెస్ నాయకులకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విమర్శించారు. గురువారం తల్లోజు ఆచారితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలపై కాంగ్రెస్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
WGL: కరీమాబాద్ SRR తోటలో అక్రమంగా నిర్వహిస్తున్న మూడు ఇసుక డంపులపై ఇవాళ మిల్స్ కాలనీ CI రమేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఇసుక డంపు చేస్తున్న వారిని అదుపులో తీసుకొని MRO ముందు బైండ్ ఓవర్ చేశారు. అనంతరం CI రమేష్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుక నిల్వ చేయడం, తరలించడం చట్ట రీత్యా నేరమని సీఐ హెచ్చరించారు.
JN: ఓ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రజా కవి జయరాజ్‌తో కలిసి విద్యార్థులు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహనపై చర్చలు జరిపారు. యువతలో ప్రకృతి పట్ల చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
NLG: చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వచ్చే నెల మార్చి 6 వరకు జరగనున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వార్షిక జాతరకు చండూరు మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు భక్తులు తరలిరావాలని ఆలయ కమిటీ కోరుతుంది.
MBNR: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మండలం షేర్ పల్లి, హస్నాపూర్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ పేదలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
MDK: నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామస్తుల కల నెరవేరింది. కొన్ని దశాబ్దాలుగా తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం నుండి ఆర్టీసీ బస్సు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు,