MBNR: జిల్లాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. NECC ఒక్క గుడ్డు ధర 4.30 ఉన్నప్పటికీ.. డిమాండ్ లేకపోవడంతో.. గుడ్డు ధర రూ.3.50 మాత్రమే పలుకుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుండడంతో కోడిగుడ్ల ఎగుమతి లేదని పౌల్ట్రీ ఫారం యజమానులు అన్నారు. యుద్ధం వల్ల ఎగుమతి లేకపోవడంతో నిల్వలు పెరిగాయన్నారు.
KMM: రఘునాధపాలెం మండలం కోయచలక వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోయచలక స్వాతి మినరల్స్ దగ్గర ట్రాక్టర్, ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాక్టర్ ట్రక్కుని వెనుక నుంచి ఆటో ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. గాయాలపాలైన ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
NLG: నల్గొండ బస్టాండ్‌లో వాహనాల పార్కింగ్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. లోపలికి వెళ్లి వచ్చేలోపే ఆవరణలో నిలిపిన వాహనాల టైర్లలో ఆర్టీసీ, పార్కింగ్ సిబ్బంది గాలి తీసేస్తున్నారు. లగేజీ పెట్టుకుని వచ్చేలోపే ఇలా చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం వల్ల బస్సుల రాకపోకలకు ఆటంకం కలుగుతోందని తేలిపారు.
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దక్షిణ దిగ్యాత్ర వేడుక నిన్న రాత్రి వైభవంగా జరిగింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో పోలీసు స్టేషన్‌లో సంప్రదాయ పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. దశాబ్దాలుగా ఏడాదికోసారి పోలీస్ స్టేషన్‌ను శ్రీలక్ష్మీనరసింహస్వామి సందర్శించి పోలీసు ఉన్నతాధికారులతో పూజలందుకునే ఆనవాయితీ కొనసాగుతోంది.
SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని సర్పంచ్ నాగేష్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఇవ్వాళ ఊరిలోని బావులు, బోర్లు, చేతి పంపుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయించారు. కలుషిత నీటి వల్ల వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీటిని తాగాలన్నారు.
MBNR: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజులపాటు ప్రజా పాలన పరిరక్షణ అనే కార్యక్రమం ఏర్పాటు చేశారని ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. ఈ రోజు నుంచి 12 జూన్ 26 వరకు అన్ని ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలలో పరిసరాల పరిశుభ్రత, సెక్షన్ల వారిగా పెండింగ్ పైల్స్ రూపొందించి క్లియరెన్స్ చేయాలన్నారు.
SDPT: పారదర్శక పాలనతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ద్వారా వ్యవసాయం,విద్య,ఆరోగ్యం,ఉపాధి వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వారం ఒక నిర్దిష్ట రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు.
ADB: అందరి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.
BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామ రైతులు వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే దారి గుంతల మయంగా ఉందని మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ భూక్య సరిత సుధాకర్‌కు విన్నవించారు. స్పందించిన సర్పంచ్ శుక్రవారం సుమారు నాలుగు కిలోమీటర్ల మేర గ్రావెల్‌తో చదును చేయించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
RR: సింగూరు ప్రాజెక్టు నుంచి HYDకు నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు ప్రాజెక్టు వద్ద లీకేజీ ఏర్పడటంతో ఒక రోజు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మణికొండ డివిజన్ జలమండలి మేనేజర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నీటి సరఫరా ఉండదని, మణికొండ, నార్సింగి, కోకాపేట డివిజన్ల పరిధిలో రావాల్సిన నీరు రాదన్నారు.
KMM: వైరా పట్టణాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం వైరా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపా చంద్రకళ, వైస్ ఛైర్మన్ కట్ల సంతోష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.
NLG: శాలిగౌరారం మండలంలోని శాలి లింగోటం గ్రామంలో బుధవారం కోనేటి అఖిల్, లోడే పవన్ అనే ఇద్దరు స్నేహితులు మద్యం సేవించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని స్థానికులు గమనించి 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
NGKL: తెలంగాణలో రాజ్యసభ కోటాలో అవకాశం వస్తుందనే ఆశతో ఎదురుచూసిన వంశీ చందర్ రెడ్డికి చివరికి నిరాశ ఎదురైంది. రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్య సభస్థానాల కోసం వివిధ నాయకుల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరి దశలో ఆయనకు అవకాశం దక్కలేదు. పార్టీ పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
NRPT: అంతర్జాతీయ మహిళా హాకీ సమరానికి భాగ్యనగరం వేదిక కానుంది. ఎఫ్ఎహెచ్ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి అందజేశారు.
SRD: ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల మౌలిక వసతుల కల్పనకు నిరంతరం దాతలు సహకరించడం అభినందనీయమని GHM మన్మధ కిషోర్ అన్నారు. శుక్రవారం ఖేడ్ ZPHSలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.10 వేల విలువగల ఇన్సులేటర్ పరికరాన్ని పాఠశాలకు అందించారు. ఈ ఏడాదిలో 900 మంది విద్యార్థులకు బ్యాగులు విద్యా సామాగ్రి, ఆంగ్ల నిఘంటువులు, క్రీడా సామాగ్రీ, క్రీడా దుస్తులు అందించారన్నారు.