HYD: రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. నానక్‌రామ్‌గూడ రోటరీ నుంచి గచ్చిబౌలి వైపు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పీక్ అవర్స్ సమయంలో మరింత ఆలస్యం ఉండే అవకాశం ఉంది. వాహనదారులు వీలైనంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని లేదా అదనపు ప్రయాణ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలన్నారు.
KMR: కామారెడ్డి నుంచి రాజంపేట, గుండారం మీదుగా మెదక్‌కు ఆర్టీసీ బస్సు సర్వీసు పునఃప్రారంభమైంది. గతంలో నిలిపివేసిన ఈ సర్వీసు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు డీఎం దినేశ్ కుమార్‌కు విన్నవించారు. అధికారుల సానుకూల స్పందనతో బస్సు తిరిగి అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పాత మార్గంలోనే బస్సు నడపాలని నిర్ణయించారు.
NZB: రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గడ్కోల్ GP పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ సండ్ర లతా శంకర్, ఉప సర్పంచ్ రొక్కం సంపత్ రెడ్డి తెలిపారు. సిరికొండలోని గడ్కోల్గ్ గ్రామంలో నూతనంగా బోరు బావి తవ్వకం పనులను ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
JGL: ప్రముఖ పుణ్య క్షేత్రం మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. దీంతో ఉప ఆలయాలైన బేతాళ, రామాలయ ఆలయాల్లోను భక్తుల సందడి నెలకొంది.
MDK: చిలిపిచేడ్ మండలంలోని అజ్జమరి, గంగారం గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. తహసీల్దార్ సహదేవ్, ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో గంగారంలో 12, అజ్జమరిలో 16 డంపులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఇసుకను ఎవరైనా తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
NRPT: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ కోసం క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. మొదటి, రెండో దశ ప్రాజెక్టులకు, డిస్ట్రిబ్యూటర్ల భూ సేకరణకు రూ.1,275 కోట్లు కేటాయించనుంది. మంత్రివర్గ ఆమోదంతో పథకం పనుల్లో వేగం పెరుగుతుందని అంచనా.
HYDలో పలు కీలక కేసులలో దర్యాప్తును మరింత వేగవంతం చేయడంపై CP సజ్జనార్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. దర్యాప్తులో ఈ భాగం అత్యంత కీలకంగా వ్యవహరించనుంది. ఇటీవలే ఈ విభాగానికి కమిషనర్ నలుగురు అధికారులను కేటాయించారు.
BDK: పినపాక మండలంలోని అమరారం గ్రామంలో జరగనున్న శ్రీ నాగులమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా జాతర కమిటీ సభ్యులు ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహించబడనున్న ఈ జాతర కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొంది, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
HYD: కోఠి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జనవరి 31న కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పరార్ అవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చివరకు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
MNCL: గ్రామాలలో సమస్యల పరిష్కారానికి వార్డు సభ్యులు కృషి చేయాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ సూచించారు. జన్నారం మండల కేంద్రంలోని పోన్కల్ రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టంలోని అంశాల గురించి శిక్షకులు వారికి వివరించారు. మౌలిక సౌకర్యాల కల్పన, సమస్యల పరిష్కారం వంటివి వివరించారు.
KNR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అయినప్పటికీ నేటికి జిల్లాల్లో పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పార్టీ క్యాడర్‌లో నిరాశ నెలకొంది. అయితే మార్చిలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని అనడంతో నాయకుల ఆశలు చిగురించాయి. పార్టీ పదవులు, మార్కెట్ కమిటీ, గ్రంథాలయాల ఛైర్మన్ వంటివి చాలా చోట్ల పెండింగ్‌లో ఉండటంతో ఎవరికి వస్తాయనేది ఆసక్తి నెలకొంది.
SRPT: హుజూర్ నగర్‌లో బంజారాల ఓట్లతో గెలిచి, వారికే అవకాశాలు ఇవ్వకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానిస్తున్నారని, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమన్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అధికారికంగా నిర్వహించవలసిన సేవాలాల్ జయంతి వేడుకలను నియోజకవర్గంలో ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. బంజారాలు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు.
MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోగా, బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో రైతులు కర్రల సాయంతో భుజాలపై ట్రాన్స్‌ఫార్మర్ మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
MHBD: నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామ పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ రెండు రోజుల క్రితం కాలిపోగా, బురదలో కాళ్లు దిగబడుతున్నా, చెమటలు కారుతున్నా పంటలను కాపాడాలనే తపనతో రైతులు కర్రల సాయంతో భుజాలపై ట్రాన్స్‌ఫార్మర్ మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ASF: రెబ్బెన మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా దేవులగూడ నుండి రెబ్బెన వైపు అతి వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతున్న ఒక వాహనాన్ని గుర్తించి పట్టుకున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రెబ్బెన SI వెంకట కృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.