KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే బయలుదేరిన KMR ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సముదాయానికి చేరుకున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు నెలకొన్న నేపథ్యంలో కలెక్టరేట్ సముదాయానికి రావాలని ఎమ్మెల్యే శనివారం సవాలు విసిరిన విషయం విధితమే. సవాలను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు సైతం కలెక్టరేట్ కి వస్తారో లేదో ప్రశ్నార్థకంగా మారింది.
NZB: కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మెట్పల్లిలో నిర్వహించిన ఛాంపియన్‌షిన్‌లో పాల్గొని 5 స్వర్ణ, 8 రజత,14 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలను ప్రిన్సిపల్ ఉదయ్, సోమవారం అభినందించారు. విద్యార్థుల కృషిని కొనియాడుతూ..వారికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.
NLG: దేవరకొండలోని అంబేద్కర్ విగ్రహానికి రజక సంఘం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకొని దాడి చేసి 2 నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని జీవన శివాలయంలో ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.
HYD: మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్‌లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు.
MLG: స్టేషన్ ఘనపూర్ పట్టణానికి చెందిన రాజ్ కుమార్ ఇటీవల మేడారం వెళ్తుండగా తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. వెంటనే బాధితుడు పస్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీని త్వరగా గుర్తించారు. ఇవాళ బాధితుడు రాజ్ కుమార్‌కు పోగొట్టుకున్న ఫోన్ను పోలీసులు అందజేశారు.
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కోమటి కుంట అమ్మకంపై ఉద్రిక్తత దారితీసింది. రెండు రోజులుగా హిటాచి యంత్రంతో కుంటను చదులు చేస్తున్నారు. దీంతో సోమవారం సర్పంచ్ సాంబయ్య, వార్డు సభ్యులు, రైతులు, సంఘ నేతలు అట్టి యంత్రాన్ని నిలిపివేశారు. ఇట్టి విషయాన్ని రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్‌ను ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
RR: చౌదరిగూడ మండలం ఏదిర గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు, ఏదిర గ్రామమాజీ సర్పంచ్ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. సొంతింటి కల నెరవేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
HNK: ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని కేయూ వీసీ ప్రతాపరెడ్డి అన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం గ్రామీణ ఉత్పత్తుల సంతను వీసీ ప్రారంభించారు. కోవిడ్ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచిందని, సేంద్రియ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, పాలకమండలి సభ్యురాలు అనితారెడ్డి, నిమ్మల శ్రీనివాస్ ఉన్నారు.
VKB: జిల్లాలో పరీక్షల సమయంలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కీలక చర్యలు చేపట్టింది. సీబీఎస్ఈ (CBSE) తరహాలో పరీక్షల మధ్య విరామ సమయాన్ని పెంచారు. ఈ గ్యాప్‌లో విద్యార్థులు బడికి వచ్చేలా ప్రోత్సహిస్తూ, వారిని పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు ప్రతిరోజూ మూడు ప్రత్యేక పీరియడ్లను కేటాయించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) రేణుకాదేవి తెలిపారు.
KMM: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట పరిషత్ అప్పర్ ప్రాథమిక పాఠశాలకు సర్పంచ్ కోర్సా రాజేష్, ఉపసర్పంచ్ నాగ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వాటర్ ప్యూరిఫైయర్‌ను అందజేశారు. సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి దీనిని ప్రారంభించారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు.
MDK: అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద ఈ నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో సహకరించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ సందర్భంగా గ్రామస్థులు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
PDPL:ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో 45 నిమిషాల ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 22 సెంటర్లలో ఇంటర్ ప్రథమ 5120,ద్వితీయ 5247మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాలలో అన్ని సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9-12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు.
ADB: ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన మెరుగైన పాల ఉత్పత్తులని ప్రజలు వాడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలోని విజయ పాల ఉత్పత్తుల కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ ఛైర్మన్ బండారు అనూష తదితరులున్నారు.
MNCL: గ్రామాల అభివృద్ధి ప్రణాళికలలో వార్డు సభ్యుల భాగస్వామ్యం ముఖ్యమైందని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీఓ జలంధర్ అన్నారు. జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని రైతు వేదికలో రెండో విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు అవసరమన్నారు.