»Pac Meeting Today Cm Revanth Reddy Will Hand Over Key Responsibilities To Them
Telangana: నేడు పీఏసీ సమావేశం..వారికి కీలక బాధ్యతలు అప్పగించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అవుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే హాజరుకానున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. సోమవారం జరగబోయే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఉంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీల నియామకంపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న సమావేశం కాబట్టి ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించేలా చర్చలు సాగనున్నాయి.
అలాగే కొత్త డీసీసీల నియామకాలపై కూడా ఈ భేటీలో చర్చలు చేపట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ మరింత బలోపేతానికి తగిన చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఎన్నికల ముందు ఏ విధంగా పార్టీ పని చేసిందో, అలానే మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేలా నాయకుల చర్చించనున్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకునేందుకు రోడ్‌మ్యాప్ రూపకల్పనపై పీఏసీ దృష్టి సారించనుంది.
ఇప్పటి వరకూ సాగిన పది రోజుల పాలన పరమైన అంశాల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవడంతో పాటుగా ఆ పథకాల వల్ల ప్రజలకు లాభం జరగుతుందో లేదో తెలుసుకునేలా జిల్లా స్థాయిలో నాయకులను ఏర్పాటు చేసేందుకు పార్టీ వర్గాలు కీలక విషయాలను చర్చించనున్నారు. ఇకపోతే ఈ నెల 19వ తేదిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.