Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తాను ఏ రోజు తప్పు చేయలేదని, చేయబోనని తేల్చిచెప్పారు. 3 రోజుల్లో తనపై, కుటుంబ సభ్యులపై దర్యాప్తు సంస్థలు రైడ్స్ చేస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు కాజేశారని.. ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారని తెలిపారు. సర్వేలు, నివేదికలు ఏవీ తమకు అనుకూలంగా లేకపోవడంతో బీజేపీతో కలిసి రైడ్స్ చేయిస్తున్నారని ఆరోపించారు. తాను ఒక్కడినే కాదని.. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీలో ముఖ్య నేతలను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదన్నారు.
ప్రజాస్వామ్యం అనే ముసుగులో బీఆర్ఎస్ అరాచకాలు చేస్తుందని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నానని పొంగులేటి మరోసారి స్పష్టంచేశారు. 10 సీట్లు కాంగ్రెస్, సీపీఐ కూటమి గెలుచుకోబోతుందని తెలిపారు. 78 సీట్లతో డిసంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని వివరించారు. తమ 6 గ్యారెంటీలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.