ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో మజ్లిస్ హాజరు కాలేదు. ఎంఐఎంను సీఎం కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదో తెలియడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసే ఉంటున్నాయని, జాతీయ వేదికను మాత్రం పంచుకోకపోవడం ఏంటీ, ఇందులో ఏదో జిమ్మిక్కు ఉందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి పువ్వాడ అజయ్ కూడా సమర్థించారని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో కూడా ఇతర పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేయడం సరికాదన్నారు. తెలంగాణలో సీఎల్పీనే విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని రేవంత్ మండిపడ్డారు.
ఖమ్మం సభలో కేసీఆర్ తన విధానాలను స్పష్టం చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని అడిగారు. ఆ పార్టీని ఎలా ఓడిస్తారు అని నిలదీశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క ఎంపీ లేరని చెప్పారు. ఆ పార్టీ బీజేపీని ఎలా ఓడిస్తుందని అడిగారు. కేసీఆర్తో వేదిక పంచుకున్న నేతలకు అంత సీన్ లేదన్నారు. దేశంలో మూడో కూటమికి అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్కు ఈ విషయం తెలుస్తోందని చెప్పారు.