»Manukota Rallu Same Incident Happended For Ys Jagan And Sharmila In Mahabubabad
Manukota రాళ్ల దెబ్బలు: నాడు జగన్ కు.. నేడు షర్మిలకు
ఈ ప్రాంతం మాత్రం వైఎస్ కుటుంబానికి మాత్రం అచ్చి రాలేదు. ఆ ప్రాంతంలో ఆ కుటుంబానికి మానుకోట ప్రజలు చుక్కలు చూపించారు. వైఎస్ కుటుంబం (YS Family)లోని వారికి మానుకోట ప్రజల రాళ్ల దెబ్బలు తప్పడం లేదు. నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి.. నేడు ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila)కు కూడా మానుకోట ప్రజల నుంచి పరాభవం ఎదురైంది.
పోరాటాల గడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District). నాడు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ వరంగల్ ప్రాంతం కీలకంగా మారింది. మానుకోట (Manukota) ప్రాంతంగా పేరుగాంచిన మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) మరింత ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో మహబూబాబాద్ ప్రాంతం మార్మోగింది. అయితే ఈ ప్రాంతం మాత్రం వైఎస్ కుటుంబానికి మాత్రం అచ్చి రాలేదు. ఆ ప్రాంతంలో ఆ కుటుంబానికి మానుకోట ప్రజలు చుక్కలు చూపించారు. వైఎస్ కుటుంబం (YS Family)లోని వారికి మానుకోట ప్రజల రాళ్ల దెబ్బలు తప్పడం లేదు. నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి.. నేడు ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila)కు కూడా మానుకోట ప్రజల నుంచి పరాభవం ఎదురైంది.
నాడు సమైక్యాంధ్రకు మద్దతు పలికిన జగన్ ఓదార్పు యాత్ర పేరుతో మహబూబాబాద్ కు రావాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2010 మే 28న మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు జగన్ చేరుకోగా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులు చేరుకుని జగన్ ను అడ్డుకున్నారు. జగన్ ను అసలు స్టేషన్ బయటకు రాకుండా చేశారు. సమైక్యాంధ్ర వాది డౌన్ డౌన్.. గో బ్యాక్ జగన్ అంటూ ఆ ప్రాంతం నినాదాలతో మార్మోగింది. తెలంగాణ ద్రోహికి తెలంగాణలో స్థానం లేదని చాటి చెప్పారు. ఈ సందర్భంగా జగన్ భద్రత సిబ్బంది కాల్పులకు పాల్పడడంతో ఉద్యమకారులు, ప్రజలు రాళ్ల దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. జగన్ బృందంలోని వారు కాల్పులు జరపడంతో దాదాపు పది మంది ఉద్యమకారులు గాయపడ్డారు. ఈ మానుకోట ఉద్యమంతో జగన్ వెనక్కి తగ్గాడు. తోక ముడించుకుని వెళ్లిపోయాడు.
తాజాగా ఇప్పుడు ఆయన సోదరి వైఎస్ షర్మిలకు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. ప్రజా ప్రస్థానం పేరిట మహబూబాబాద్ జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించింది. అడుగడుగునా మహబూబాబాద్ జిల్లాలో ఆమెకు అడ్డంకులు ఎదురయ్యాయి. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అయినా కూడా బలవంతంగా ఆమె విగ్రహం ఏర్పాటు చేయించింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా మహబూబాబాద్- మరిపెడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల క్యాంపుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు. ఆమె యాత్ర ప్రారంభించకుండానే అదుపులోకి తీసుకున్నారు. అటు నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ పరిణామంతో తెలంగాణ ఉద్యమకారులు నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ కు ఎదురైన సంఘటన షర్మిలకు కూడా తప్పలేదు అని భావిస్తున్నారు.