ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక జరగగా.. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా… మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్లో కూసుకుంట్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. కూసుకుంట్లను అభినందించారు.
ఉద్యమ కారుడుగా పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ కొనసాగుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మునుగోడు ఓటర్లు పట్టం కట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. 10వేల ఓట్లకు పైగా మెజార్టీ అందించారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కూసుకుంట్ల ఇక నుంచి మునుగోడు అభివృద్ధికి మరింత కృషి చేయనున్నారు. అధినేత ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న పనులను చకచకా ముగించనున్నారు. సీఎం కేసీఆర్ కూడా మునుగోడు ఎన్నికల ప్రచార సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చే పనిలో కూసుకుంట్ల బిజీ కానున్నారు.
మంత్రి కేటీఆర్ కూడా మునుగోడును దత్తత తీసుకుంటానని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించారు. కూసుకుంట్ల గెలిచిన కొన్ని నిమిషాల్లోనే తాను మునుగోడును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ కూడా ఇక నుంచి మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.