రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ (CM KCR) గజ్వేల్‌కు బదులుగా కామారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి గజ్వేల్(Ghazwal)లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కాగా, మరొకటి కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ప్రభావం పెరుగుతుందని భావించడమే. గజ్వేల్‌లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటిది మళ్లీ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేసీఆర్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం అయ్యుండి ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు.
అందుకే అక్కడి నుంచి పోటీ చేయకుండా మరో నియోజవర్గాన్ని ఎంచుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిపై కూడా సర్వేలు నిర్వహించుకున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి 2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. సీఎంపూర్వీకుల స్వగ్రామం కామారెడ్డి (Kamareddy) అసెంబ్లీ నియోజక వర్గం దోమకొండ మండలం పోసానిపల్లే. ప్రస్తుతం దీనిని కొనాపూర్ గా పిలుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాం నిర్మాణంతో సొంతూరు ముంపుకు గురవ్వగా, కేసీఆర్ కుటుంబం ఆ నాడు సిద్దిపేట (Siddipet) జిల్లా చింతమడక గ్రామానికి వలస వచ్చింది. ఈ విషయాన్నే కేటీఆర్ కామారెడ్డి పర్యటనలో స్వయంగా వెల్లడించారు. దీంతో సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేయడం దాదాపు ఖాయమని స్థానిక నేతలు అంటున్నారు. ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్‌కు సొంతూరు సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.