మాస్టర్ ప్లాన్ పేరిట తమ పొలాలను లాక్కొవద్దనే డిమాండ్ తో కామారెడ్డి, జగిత్యాల రైతులు చేస్తున్న పోరాటం విజయం దిశగా సాగుతోంది. వారి పోరాటాలకు మున్సిపల్ కౌన్సిల్స్ దిగొస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలని ఆయా మున్సిపల్ కౌన్సిల్స్ ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దీంతో త్వరలోనే ఆ ముసాయిదాలు రద్దయ్యే అవకాశం ఉంది. రైతుల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ముసాయిదాల రద్దుకే మొగ్గు చూపనుంది.
జగిత్యాల, కామారెడ్డి పట్టణాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. భవిష్యత్ లో పట్టణాల విస్తరణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల, కామారెడ్డి పట్టణాలకు మాస్టర్ ప్లాన్ లు రూపొందించింది. ప్రజలు, రైతుల అభిప్రాయం కోసం ముసాయిదాను రూపొందించింది. ప్రభుత్వం తీసుకొచ్చింది కేవలం ముసాయిదానే. కానీ రైతులు మాస్టర్ ప్లాన్ నిర్ణయం తీసుకున్నారని ఆందోళన చెందుతున్నారు. తమ భూములు కోల్పోతామనే భయాందోళనతో ఉద్యమ బాట పట్టారు. మాస్టర్ ప్లాన్ అమలైతే పెద్ద ఎత్తున రైతులు భూములు కోల్పోనున్నారు. దీంతో మాస్టర్ ప్లాన్ లకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. కామారెడ్డి రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం కావడంతో వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతుల అభిప్రాయం మేరకు మాస్టర్ ప్లాన్ పై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని భీష్మించుకుని కూర్చుకున్నారు. నిరసనలు రోజుకో తీరున చేపడుతున్నారు. చివరకు మున్సిపల్ కౌన్సిలర్లను రాజీనామాలు చేయాలని ఉద్యమించారు. విలీన గ్రామాల సర్పంచ్ లు రాజీనామాలు చేశారు. రోజురోజుకు వీరి ఆందోళనలు తీవ్రమవుతున్నాయి.
ఈ క్రమంలో కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీలు అత్యవసర సమావేశం నిర్వహించాయి. రైతుల ఆందోళన నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. కామారెడ్డిలో చైర్మన్, వైస్ చైర్మన్ తో సహా మొత్తం 49 వార్డుల కౌన్సిలర్లు ముసాయిదా రద్దుకు మద్దతిచ్చారు. ప్రస్తుత ముసాయిదాను రద్దు చేసి.. ప్రత్యామ్నాయ ముసాయిదాను ప్రభుత్వానికి పంపినట్లు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి తెలిపారు. కామారెడ్డిలో ఇండస్ట్రీయల్ జోన్ చేయమని స్పష్టం చేశారు. ఈ విషయం గ్రహించి రైతులు ఆందోళన విరమించాలని విన్నవించారు.
జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో సమావేశమైన మున్సిపల్ కార్యవర్గం ముసాయిదా రద్దుకు తీర్మానం చేసింది. త్వరలోనే ముసాయిదా రద్దుపై అధికారిక ప్రకటన రానుందని ఆయా మున్సిపల్ కార్యవర్గాలు తెలిపాయి.