తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి హైకోర్టు నుంచి మద్దతు లభించింది. శాంతి భద్రతల కారణంగా.. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు ఆయన యాత్ర ను అడ్డుకోవడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కాగా….బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. కొన్ని షరతులతో పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
భైంసా పట్టణంలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని, భైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించాలని హైకోర్టు సూచించింది. బండి సంజయ్ పాదయాత్రకు నిర్మల్ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని బీజేపీ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఉదయం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
బీజేపీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు… పాదయాత్రలు, ర్యాలీలు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వాటిని అనుమతి నిరాకరించడం సరికాదని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని, 3 కిలోమీటర్ల దూరంలో సభ లేదని భావిస్తే పోలీసులు అభ్యంతరం చెప్పవచ్చని హైకోర్టు సూచించింది. దీంతో సభా స్థలానికి ఉన్న దూరమెంతో చెబుతామని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం యధావిథిగా కొనసాగే అవకాశముంది.
బండి పాదయాత్ర సందర్భంగా భైంసాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం, అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.