Harish Rao: ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు..సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లాగా తమకు పార్టీ మారిన చరిత్ర లేదన్నారు. పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర తమదని హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
పదవులను గడ్డి పోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకే ఉందని హరీశ్ రావు అన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉందన్నారు. తాము ఏదో పదవుల కోసం పాకులాడినట్లుగా సీఎం మాట్లాడుతున్నారన్నారు. అలా మాట్లాడ్డం సరికాదన్నారు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పనిచేశాడని, టీఆర్ఎస్లో పని చేశాడని, తెలుగుదేశంలో కూడా ఉన్నాడని అన్నారు. ఆ సమయంలో హరీశ్ రావు, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
అసెంబ్లీలో హరీశ్ రావు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఆపివేసే ప్రయత్నం చేశారు. మిగతా ప్రతిపక్ష సభ్యులకూ మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. హరీశ్ రావును మాట్లాడనీయకుండా ప్రయత్నిస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. ప్రతిపక్ష నేతగా వివరణను కేటీఆర్ ప్రారంభించారని, అలా అయితే ఆయన పూర్తి చేయవలసి ఉంటుందని, కానీ హరీశ్ రావు ఎలా మాట్లాడుతారని మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
దీనికి స్పందించిన హరీశ్ రావు.. రికార్డులు వెరిఫై చేసుకోవాలని, గతంలో తాము భట్టి విక్రమార్కకు గంటన్నర సమయం, శ్రీధర్ బాబుకు 10 నిమిషాల సమయం మాట్లాడేందుకు ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంత సేపు అయినా మాట్లాడనీయండి అంటారని.. కానీ తమ గొంతు నొక్కుతున్నారని, వారి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదన్నారు. ఇప్పుడే తమ గొంతు నొక్కితే.. రేపు తమకు న్యాయం చేస్తారంటే ఎలా నమ్మాలని హరీశ్ రావు ఘాటుగా ఫైర్ అయ్యారు.