గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు (High Court) వెల్లడించింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. పరీక్ష రద్దు తీర్పు సరైనదేనని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ TSPSC చేసిన అప్పీల్‌ని హైకోర్టు కొట్టేసింది. ఈసారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ (Biometric) తీసుకోవాలని ఆదేశించింది. పరీక్షలో టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని పేర్కొంది..జూన్ 11న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ (Group-1Prelims) రెండోసారి నిర్వహించారు. అందులో కూడా అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కారు. 503 పోస్టులతో విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం రెండుసార్లు ఎగ్జామ్ రాశారు. లీకేజీ ఆరోపణలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)మొదటి సారి గ్రూప్ – 1 పరీక్షను రద్దు చేసింది. పకడ్బంధీగా రెండోసారి నిర్వహించాలని భావించారు. రెండోసారి పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు తలెత్తాయి.
వీటిని పాయింట్ అవుట్ చేస్తూనే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని.. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు (OMR sheets) ఇచ్చారని పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేకపోతే.. మళ్లీ పరీక్షను నిర్వహిస్తుందా అన్నదనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.