టీఎస్పీఎస్సీ (TSPSC) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో, ఓఎంఆర్ (OMR) పద్ధతిలోనే నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. జూన్ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత సంవత్సరం ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 16న పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,85,916 మంది హాజరయ్యారు. మెయిన్స్‌కు 25,050 మందిని కమిషన్ ఎంపిక చేసింది. ఈలోగా ప్రశ్నపత్రాల లీకేజీ (paper Leakage )వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌తోపాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది. మళ్లీ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పించింది.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీలో ప్రక్షాళనకు సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలుత ప్రత్యేకంగా పరీక్ష విభాగాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల నుంచి 50 వేలలోపు మంది అభ్యర్థులు ఉంటే కంప్యూటర్ బెస్డ్ పరీక్ష (CBT) నిర్వహిస్తున్నారు. రెండు సెషన్లలో పరీక్షను పూర్తిచేసి, మార్కులను నార్మలైజేషన్ పద్ధతిలో లెక్కిస్తున్నారు. లక్ష కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే మాత్రం ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష జరుపుతున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సైతం ఓఎంఆర్ (OMR) పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.పేపర్ లీకేజీ వ్యవహారం అనంతరం ప్రభుత్వం టీఎస్పీఎస్పీలో సమూల మార్పులు చేసింది.
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి హోదాలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా బీఎం సంతోష్(BM Santosh), అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా ఎన్ జగదీశ్వర్ రెడ్డిని నియమించింది. కొత్తగా డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్, లా ఆఫీసర్(Law Officer)(జూనియర్ సివిల్ జడ్జి క్యాడర్) పోస్టులను మంజూరు చేసింది. దశలవారీగా ఆ పోస్టులను భర్తీ చేస్తోంది. గతంలో పనిచేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరినీ మార్చిన ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఆఫీసులో పని చేసే ఉద్యోగుల విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.