కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తాజాగా సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం లేకుండా చేశారని విమర్మనాస్త్రాలు గుప్పించారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్దం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని ఆరోపించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసిఆర్ చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుందని అన్నారు. జీవనది లాంటి శ్రీరామ్ సాగర్ ను మహారాష్ట్ర చేతికి ఇస్తే..ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అవుతుందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయని.. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ప్రాజెక్టు వృధా అవుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే సాగునీటి కోసమన్నరు.
ఇప్పుడు తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తానంటే, కేసీఆర్ను ప్రజలు ఛీ కొడతారంటూ పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. గోదావరిపై మహారాష్ట్ర కడుతున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టుల గురించి మనం ఎన్నో ఉద్యమాలు చేశామని.. ఇప్పుడు ఆ నీళ్లను వాళ్ళు తోడుకుంటే చూస్తూ ఊరికే ఉందామా? అని ప్రశ్నించారు. బాబ్లీ మీద పోరాటం చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని.. ఈ విషయంపై వాళ్లేమంటారని నిలదీశారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకపోతే రైతు ఉద్యమం చేయక తప్పదని ఆయనహెచ్చరించారు.