Free bus: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు దిశగా వెళ్తోంది. ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మొదటగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. నిన్న మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. అయితే వాహనరంగంపై ఆధారపడి బతుకుతున్న డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లున్నారని, కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాలని, జీవనభృతి కింద నెలకు రూ.15 వేలు ప్రభుత్వం అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల్లోనే ఇలా జరిగిందని.. తెలంగాణ ఏర్పడిన పదేండ్లలో ఆటోడ్రైవర్లు ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదని ఆటో యూనియన్ చెబుతోంది.
ఆటో కార్మికులలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్నారు. ఆటో మీటర్ రేట్లు పెంచి కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఓలా, ఉబర్ సంస్థలను ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై వారం రోజుల్లోగా పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ డిపోల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.