కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiya) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. పార్టీ బీసీలకు తగిన సీట్లు కేటాయించడం లేదని ఇప్పటికి పొన్నాల పలుమార్లు అవేదని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీఆర్ఎస్ (BRS) చేరతున్నట్లు తెలుస్తోంది. జనగామ డిసిసి నియామకం జరిగినప్పటి నుంచి పొన్నాల మనస్తాపంతో ఉన్నారు. కొత్త వారికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చే ప్రయత్నాలు ఆయనను మనస్తాపానికి గురి చేశాయి.
జనగామ (Janagama) టిక్కెట్ పొన్నాలకు వచ్చే అవకాశం లేకపోవడంతోనే పొన్నాల కాంగ్రెస్ పార్టీని వీడినట్టు తెలుస్తోంది. టికెట్ విషయంలో గత కొన్ని రోజులుగా పొన్నాల అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి(Kommuri Pratap Reddy)కి జనగామ టికెట్ ఇస్తారని ప్రచారం ఉంది. మాజీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాలకు తీవ్ర స్థాయిలో అవమానానికి గురి చేసినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని తన లేఖలో ఆరోపించారు.
2018లో కూడా చివరి నిమిషం వరకు తేల్చకుండా తనను అవమానించారని పొన్నాల ఆరోపిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డి (Mutthi Reddy) యాదగిరి రెడ్డి బిఆర్ఎస్ పార్టీ తరపున జనగామలో గెలుపొందారు. ఈ సారి కూడా పొన్నాలకు టిక్కెట్ దక్కకపోవచ్చని విస్తృత ప్రచారం జరుగుతోంది.ఉమ్మడి రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్య సుదీర్ఘకాలం నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. లక్ష్మయ్య 1989లో తొలిసారి గెలిచి నేదురుమల్లి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 1999, 2004, 2009లలో కూడా గెలుపొందారు. 2004లో గెలిచాక వై.ఎస్. (YSR )క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అనంతరం రోశయ్య, కిరణ్ క్యాబినెట్లలో మంత్రిగా కొనసాగారు.