తెలంగాణలో ఇకపై వార్తా సంస్థల్లో రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని సీఈవో స్పష్టంచేశారు. నేతలు, అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
EC To Put Breaks On Political Ads: తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇకపై అన్ని రకాల రాజకీయ ప్రకటనలు నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. వార్తా సంస్థల యాజమాన్యాలకు ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లేఖ రాశారు.
ఎన్నికల సంఘం (EC) నిబంధనలను నేతలు ఉల్లంఘిస్తున్నారని గుర్తించారు. ఇష్టారీతిన ప్రకటనలు ఇస్తూ.. ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. స్టేట్ లెవల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో (CEO) తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
రాజకీయ నేతలు, అభ్యర్థులు.. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Code Of Conduct) ఉల్లంఘించడంతో పొలిటికల్ యాడ్స్ రద్దు చేశామని తెలిపారు. ఆయా వార్తా సంస్థలు, టీవీ చానెళ్లు, డిజిటిల్ మీడియా వెంటనే ప్రకటనలను నిలిపివేయాలని తేల్చిచెప్పారు.