Dharmapuri Arvind: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. లోకల్, నాన్ లోకల్ అనే వాళ్లందరికి నేను ఇచ్చే సమాధానం ఒకటే. బ్రోకర్ ముఖ్యమంత్రి కొడుకు సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకుగా నేను లోకల్ నే అవుతానని అన్నారు. నేల తల్లి నుదిటిన తిలకం పెట్టిన యువతది కోరుట్ల ప్రాంతం. ఇక్కడి నుంచి పోటీ చేయడం తన అదృష్టం. ఏ జన్మలో చేసిన పుణ్యం వల్ల ఇంతటి అదృష్టం దొరికింది. కోరుట్ల నియోజవర్గం రాజకీయాల్లో చాలా మార్పులు తీసుకొస్తుందని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.
కోరుట్లలో బీజేపీ విజయం తెలంగాణ రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తుందని అర్వింద్ అంటున్నారు. కోరుట్ల నియోజవర్గంలో డబ్బులు పంచకుండా బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. అబద్ధాన్ని అందంగా చెప్పేవాడే కేసీఆర్. ఈవీఎంలలో రోడ్డు రోలర్, కారు గుర్తులను గుర్తించేందుకే కంటి వెలుగు తీసుకొచ్చాడని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తెలిపారు. నిజమాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని కవితపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో సొంతంగా గెలవలేని కవిత.. ఇతరులను ఎలా గెలిపిస్తుందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కవిత, కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగిందని విమర్శించారు.