Ibrahimpatnam: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నామినేషన్లు వేసేందుకు రేపటితో గడువు ముగియనుండగా.. ఈ రోజు మెజార్టీ సభ్యులు నామినేషన్ ఫైల్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు, కేటీఆర్, హరీశ్ రావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు నామినేషన్ వేశారు.
నామినేషన్ వేసే సమయంలో ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరూ ఓకేసారి ర్యాలీగా ఆర్డీవో ఆఫీసుకు వచ్చారు. ఇద్దరూ భారీగా ర్యాలీతో ఓకేసారి వచ్చారు. దీంతో ఘర్షణకు కారణమైంది.
ఒకరి తర్వాత ఒకరు వెళ్లి నామినేషన్ వేయాలని పోలీసులు కోరగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మాటల యుద్ధం జరిగింది. విమర్శలు పెరిగి.. దాడి వరకు వెళ్లింది. రాళ్లతో దాడి చేయడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ దాడిలో 15 మంది వరకు గాయపడ్డారు. వీరిలో నలుగురు, ఐదుగురు పోలీసులు కూడా ఉన్నారు.
ఇరు వర్గాలు వస్తాయని.. గొడవ జరుగుతుందని తెలిసినప్పటికీ.. పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. స్వల్ప గాయాలు కావడం.. ఘర్షణ తగ్గుముఖం పట్టడంతో ఉన్నతాధికారులు రిలాక్స్ అయ్యారు. తొలుత కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి.. తర్వాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది.